భార్యని చంపిన నేరానికి భర్తకు 18 నెలలు జైలు శిక్ష .. కట్ చేస్తే బ్రతికి వచ్చిన భార్య..?

భార్యాభర్తల మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో ఆ గొడవలు ముదిరిపోయి ఒకరికొకరు ప్రాణాలు తీసుకొని స్థాయికి చేరుకుంటాయి. ఆరేళ్ల క్రితం భార్యను చంపిన నేరం కింద భర్త 18 నెలల జైలు శిక్ష అనుభవించాడు. ఆ భార్య తిరిగి రావటంతో ఆ భర్త షాక్ కి గురయ్యాడు. తాజాగా ఈ సంఘటన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. మధుర SWAT టీమ్, సైబర్ సెల్ ఇన్‌ఛార్జ్ అధికారి అజయ్ కౌశల్ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేశాడు.

వివరాలలోకి వెళితే…రాజస్థాన్‌లోని కరౌలీ, దౌసా జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న మెహందీపూర్ బాలాజీ ఆలయానికి ఆర్తీ దేవి (26), ఆమె తండ్రి సూరజ్ ప్రకాష్ గుప్తాతో కలిసి దైవ దర్శనానికి వెళ్లారు. ఆ సమయంలో ఆర్తి దేవికి సోనూ సైనీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 2015లో ఆర్తి తన తండ్రికి తెలియకుండా సోను సైనీ ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఉత్తర ప్రదేశ్ లోని బృందావన్ కాలనీలో ఒక ఇంట్లో అద్దెకు దిగారు. ఈ క్రమంలో ఒకరోజు ఆర్తి హఠాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో ఆర్తి తండ్రి ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని చూపించి తన అల్లుడు స్నేహితుడితో కలిసి తన కూతుర్ని హత్య చేసినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా నిందితులను పట్టించిన వారికి 15000 రివార్డు కూడా ప్రకటించారు.

ఆర్తి దేవి హత్య కేసులో ఆమె భర్త సోనూ సైనీ తో పాటు అతని స్నేహితుడు గోపాల్ సైనీ ని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. ఈ హత్య కేసులో సోను సైనీ 18 నెలలు, గోపాల్‌ సైనీ 9 నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత వీరికి అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇటీవల చనిపోయిందనుకున్న తన భార్య రెండవ భర్తతో కలిసి జీవిస్తోందని గమనించిన సోను, గోపాల్ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తాజాగా డిసెంబర్ 11వ తేదీ సదరు మహిళను అదుపులోకి తీసుకొని ఆమె వద్ద రెండు వేర్వేరు పుట్టిన తేదీలు ఉన్న రెండు ఆధార్ కార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే సదరు మహిళను విచారించిన తర్వాత పూర్తీ వివరాలు తెలియజేస్తామని పోలీసులు వెల్లడించారు. చేయని నేరానికి శిక్ష అనుభవించారని తనకు తగిన న్యాయం చేయాలని సోనూ సైనీ పోలీసులను వేడుకున్నాడు.