దెయ్యం పేరు చెప్పగానే ఎవరైనా భయపడుతారు. దెయ్యాలు ఉన్నాయో లేవ్వో కానీ దెయ్యానికి అయితే అంతా భయపడుతారు. తన పనితీరుతో నిత్యం వార్తల్లో ఉండే కలెక్టర్ ఆమ్రపాలి తాను దెయ్యానికి భయపడుతానని, అది కలెక్టర్ బంగ్లాలోనే ఉందని చెప్పి మళ్లీ సంచలనంగా మారారు.
వరంగల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి పునాది వేసి ఆగష్టు 10 తో 133 ఏళ్లు నిండాయి. తాను నివాసం ఉంటున్న చారిత్రక భవనం గురించి ఆమ్రపాళి చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వరంగల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి జార్జ్ పామర్ భార్య శంకుస్థాపన చేశారని ఆమె తెలుసుకున్నారట. ఇంతకీ జార్జ్ పామర్ ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తితో పరిశోధన చేయగా జార్జ్ పామర్ గొప్ప ఇంజనీర్ అని ఆమ్రపాలికి తెలిసింది.
గతంలో ఈ భవనంలో నివాసం ఉన్న కలెక్టర్లు భవనంలోని మొదటి అంతస్థులో దెయ్యం ఉందని తనతో చెప్పారని ఆమ్రపాలి అన్నారు. తాను కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టాక ఓ రోజు మొదటి అంతస్థులోకి వెళ్లి చూస్తే గది అంతా చిందర వందరంగా ఉందట. దీంతో అన్నీ నీట్ గా సర్ధిపెట్టించానని ఆమ్రపాలి తెలిపారు. అయినా సరే తనను దెయ్యం ఉందన్న భయం వీడలేదని, అందుకే అక్కడ నిద్రపోవడానికి కూడా సాహసించడం లేదని ఆమె అన్నారు.
చదువు రాని వారే దెయ్యాలకు భయపడుతారనుకుంటే అన్ని తెలిసిన కలెక్టరమ్మ భయపడటం ఏంటని జనాలు అనుకుంటున్నారు. అందరికి అది అంతా ఉత్తదే అని చెప్పాల్సింది పోయి తాను భయపడటం ఏమిటనుకుంటున్నారు.