ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు విద్యార్థుల మీద చదువుల భారం మోపుతున్నారు. పిల్లలకు ఇష్టం లేకపోయినా కూడా వారి భవిష్యత్తు బాగుండాలని బలవంతంగా వారిని చదివించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో లక్షల రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్ పాఠశాలల్లో పిల్లలు చదివిస్తున్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు కూడా చదువు విషయంలో పిల్లలను ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారు. ఉపాధ్యాయులు పెట్టే ఒత్తిడి భరించలేక చాలామంది విద్యార్థులు మానసికంగా కృంగిపోతున్నారు. ఇటీవల తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థి హోంవర్క్ ఒత్తిడి భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళితే…తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని పెరళంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో సంజయ్ అనే14 ఏళ్ల బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. అయితే తాను చదివే పాఠశాలలో రోజూ హోం వర్క్ ఎక్కువ ఇవ్వటం వల్ల సంజయ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యేవాడు. ఈ క్రమంలో తన బాధను తల్లి తండ్రులకు వివరించాడు. పాఠశాలలో హోం వర్క్‌ఎక్కువగా ఇస్తు వేధిస్తున్నారని,తాను రాయలేకపోతున్ననాని తన బాధను తల్లితండ్రుల దగ్గర బయటపెట్టాడు. తనను వేరే స్కూల్‌కి మార్చమని తల్లిదండ్రులను బ్రతిమలాడాడు. అయితే పాఠశాల మార్చడానికి సంజయ్ తల్లిదండ్రులు తిరస్కరించారు.
ఒకవైపు హోంవర్క్ ఒత్తిడి మరొకవైపు తల్లిదండ్రులు తన మాట వినకపోవడంతో సంజయ్ మరింత ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో ఒత్తిడి భరించలేక వారు నివసిస్తున్న ఇంట్లో సోమవారం పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే బాలుడి కేకలు విన్న తల్లి తండ్రులు వెంటనే మంటలు ఆర్పి హాస్పిటల్ కి తరలించారు. మంటలలో శరీరం బాగా కాలిపోవటం వల్ల సంజయ్ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లి తండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.