చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ప్రస్తుత కాలంలో చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ పోలీస్ వ్యవస్థకు మచ్చ లా మారుతున్నారు. ఇటీవల నెల్లూరులో కూడా ఇటువంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గౌరవప్రదమైన పోలీస్ అధికారిగా విధుల నిర్వహిస్తున్న ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ తో ప్రేమ వ్యవహారం నడిపి పెళ్లి కూడా చేసుకున్నాడు. పెళ్లి తర్వాత తల్లిదండ్రులతో కలిసి మహిళా కానిస్టేబుల్ ని అదనపు కట్నం కోసం వేధిస్తూ చిత్రహింసలకు గురి చేసిన ఘటన కలకలం రేపుతోంది.
వివరాలలోకి వెళితే…గుంటూరు జిల్లా పొనకేపల్లికి చెందిన SK సుభానీ నెల్లూరులోని 3టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న లక్ష్మీ ప్రసన్న అనే మహిళా కానిస్టేబుల్ ని ప్రేమించి ఇరు కుటుంబాలను ఒప్పించి పెద్దల సమక్షంలో 2019లో వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగిన కొంతకాలం వరకు వీరి కాపురం సవ్యంగా సాగిపోయింది. కొంతకాలం తర్వాత సుభాని తన తల్లిదండ్రులతో కలిసి అదనపు కట్నం కోసం లక్ష్మీ ప్రసన్నను వేధిస్తూ చిత్రహింసలకు గురి చేసేవారు.
భర్త పెట్టే హింసలను మౌనంగా భరిస్తూ వస్తున్న లక్ష్మి గర్భం దాల్చిన విషయాన్ని భర్తతో చెప్పగా కడుపులో బిడ్డను కూడా చంపడానికి ప్రయత్నాలు చేశాడు. ఆ తర్వాత లక్ష్మిని చంపటానికి ప్రయత్నం చేస్తూ ఆమె తలను గట్టిగా గోడకేసి కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయి పడిపోయింది. దీంతో లక్ష్మి మరణించిందని భావించిన సుభాని తలుపులు వేసుకొని ఇంటి నుండి పరారయ్యాడు. కొంత సమయం తర్వాత స్పృహలోకి వచ్చిన లక్ష్మి పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలి ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.