మిర్యాలగూడలో కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ హత్య చాలా విషయాలను తెరపైకి తీసుకువస్తోంది. పరువు హత్యగా పేర్కొన్న దీనిపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ హత్య జరిగినప్పటి నుంచి ప్రణయ్, అతని భార్య అమృతకు సోషల్ మీడియాలో అనూహ్య రీతిలో మద్దతు వచ్చింది. తాజాగా అమృత తండ్రి, మర్డర్ కేస్ లో ప్రధాన నిందితుడు మారుతీరావుకు కూడా సోషల్ మీడియాలో మద్దతుదారులు పెరిగిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కన్నతండ్రి దృష్టి కోణంతో చూసిన పలువురు ఆయనకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఒకవైపు ‘జై మారుతీరావు.. జై మారుతీ సేన’ అంటూ కొందరు ఫేస్‌బుక్‌లో కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు మారుతీరావు ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంటున్నారు. తన తండ్రిని ఉరితీయాలన్న అమృత వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నారు.
ఆమె వ్యాఖ్యలపై ‘‘అవును. నీ తండ్రిని ఉరి తీయాల్సిందే. నీలాంటి కూతురిని కనడమే ఆయన చేసిన పెద్ద తప్పు. అందుకు చంపాల్సిందే. నీ తండ్రిని నువ్వు ఎన్ని సంవత్సరాలుగా మానసిక క్షోభకు గురిచేశావో నీకు తెలుస్తుందా? అంటూ అమృత మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అమృత చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే ఆమెకేదో పెద్ద ఎజెండానే ఉన్నట్టుంది’’ అని మారుతీరావు మద్దతుదారుడు ఒకరు పోస్ట్ పెట్టారు.
‘తమకు ఆడపిల్లైతే పుట్టాలని, కానీ అమృత లాంటి ఆడపిల్ల వద్దు’ అంటూ కొందరు పోస్ట్ పెడుతుంటే.. ‘9వ తరగతిలో లవ్వాయణం ఎవరికి ఆదర్శం అని నిలదీస్తున్నారు. ఆ వయసు ప్రేమించేందుకు తగినదేనా.. అది ప్రేమకాదు ఆకర్షణ. అమృత విషయంలో ఈ విషయాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు’ అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
అయితే, దీనిపై సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు తెలిసి తెలియక తప్పు చేస్తే వారిని సరిదిద్దాలి కానీ చిదిమేయడం ఎంతవరకు సమంజసం అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కులాలను, మతాలను చూసుకొని ప్రేమించడం అయ్యే పని కాదంటున్నారు.
ఏది ఏమైనా ప్రణయ్ ఉదంతం అనేక ప్రశ్నలను సమాజం ముందుకు తెచ్చింది.