కరకట్ట పాపవినాశనం వద్ద కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఎస్సై వంశీధర్ గల్లంతయ్యారు. రామచంద్రపురం ఎస్సై కోట వంశీధర్ తన తల్లితో కలిసి శనివారం ఉదయం తన స్వగ్రామం కోడూరు మండలంలోని ఇస్మాయిల్ బేగ్ పేటకు వెళుతున్నారు. కరకట్ట మీదుగా అవనిగడ్డ వెళుతుండగా పాపవినాశనం దగ్గరికి వచ్చేసరికి కారుకి బ్రేక్స్ ఫెయిల్ అవడంతో కారు వేగంగా కాలువలోకి దూసుకువెళ్లింది.
ఆ సమయంలో కారులో ఉన్న తల్లి, కొడుకులను బయటకు తీసుకువచ్చారు స్థానికులు. అయితే కారులో ఏదో వస్తువు ఉందని, అది తీసుకురావటానికి వంశి తిరిగి కాలువలోకి వెళ్లారు. రెండవసారి కాలువలోకి వెళ్లిన ఎస్సై వంశీ బయటకు రాలేకపోయారు. ఈ ఘటన చూసిన వారంతా కాలువ ప్రవాహ వేగానికి ఆయన కొట్టుకుపోయారని చెబుతున్నారు.
వర్షపు నీరు, ప్రకాశం బ్యారేజి నుండి వస్తున్న నీటితో కాలువ పూర్తిగా నిండిపోయి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహ వేగానికి ఎస్సై వంశీ పులిగడ్డ లాకుల వరకు కొట్టుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు పోలీసులు. కాగా కళ్ళముందే కొడుకు కొట్టుకుపోవడం చూసిన వంశీ తల్లి తీవ్రంగా ఆందోళనకు గురి కావడంతో ఆమె ఆరోగ్యం దెబ్బ తినింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అవనిగడ్డ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై వంశీధర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరు ప్రయాణిస్తున్న కారు నెంబర్ పివై 04 8920 గా గుర్తించారు పోలీసులు. కింద వీడియోలు చూడవచ్చు.