తెలుగు ఫిల్మ్ స్టార్, పొలిటీషియన్ నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తనకు ఇష్టమైన పని చేస్తూనే ఆయన అనంతలోకాలకు చేరిపోయారు. నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద కారు ప్రమాదంలో చనిపోయారు. తానే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ తానొక్కడే కన్నుమూశారు. ఇష్టమైన పనిచేస్తూ, ఇష్టదైవం శివయ్య చెంతనే సీతయ్య ప్రాణాలొదిలారని అభిమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
నెల్లూరు జిల్లా కావలిలో తన అభిమాని కుటుంబంలో పెళ్లికి తెల్లవారుఝామున హైదరాబాాద్ నుంచి బయలుదేరారు హరికృష్ణ. మెరుపు వేగంతో కారు ప్రయాణిస్తున్నవేళ నార్కట్ పల్లి దాటగానే అన్నెపర్తి వద్ద డివైడర్ కు కారు బలంగా ఢీకొ్ట్టింది. 30 అడుగల దూరంలో హరికృష్ణ ఎగిరి పడ్డారు. డివైడర్ ను ఢీకొట్టిన కారు ఎగిరి ఎదురుగా వస్తున్న మరో కారు మీద పడింది. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న వారు గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో మాత్రం ఇప్పటి వరకు హరికృష్ణ ఒక్కడే ప్రాణాలు కోల్పోయారు.
హరికృష్ణ మరణం అభిమానులను ఆవేదనకు గురిచేసింది. ఆయన కారు నడపకపోయి ఉంటే బతికేవాడే అని అభిమానులు నిట్టూరుస్తున్నారు. ఆ కారు స్పీడ్ 160కి పైగా వేగంతో పోకపోతే బాగుండేది అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ కొడుకుగానే కాకుండా పొలిటికల్ లీడర్ గా సినీ నటుడిగా హరికృష్ణ తెలుగు ప్రజల గుండెల్లో తనదైన ముద్ర వేశారు. సీతయ్య సినిమాలో నటవిశ్వరూపం చూపారు. ఆ సినిమా డైలాగులు, పాటలు ఇప్పటికీ జనాల చెవులో మారు మ్రోగుతూనే ఉంటాయి.
సీతయ్య స్వతహాగా శివ భక్తుడు. ఆయన ప్రతి సోమ, శుక్రవారం ఇంట్లో శంకరుడికి పూజలు చేయనిది బయటకు రారు. శివరాత్రి లాంటి పర్వదినాలలో ఉపవాసం కూడా ఉంటారు. గత రెండు నెలల క్రితమే నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పచ్చల సోమేశ్వరాలయం (శివాలయం) దర్శించుకున్నారు సీతయ్య. రెండు నెలల్లోనే ఆ దేవాలయానికి సమీపంలోనే హరికృష్ణ ప్రాణాలు కోల్పోయారు.
అన్నెపర్తికి కూతవేటు దూరంలోనే చెరువుగట్టులోని పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి కిలోమీటరు దూరం కూడా ఉండదు చెరువుగట్టు ఆలయం. శివభక్తుడైన సీతయ్యను శివయ్య కాపాడలేకపోయారని ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
శివయ్య చెంతనే సీతయ్య ప్రాణాలొదిలారని హరికృష్ణ అభిమానులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హరికృష్ణ.. వీడియో కింద ఉంది చూడొచ్చు.