పవన్ కళ్యాణ్‌ని విమర్శించే క్రమంలో వైసీపీ సెల్ఫ్ ట్రోలింగ్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజానికి సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్. అయితే, వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ని వైసీపీ అంటే గిట్టనివారెవరో రన్ చేస్తున్నట్లు తయారైంది పరిస్థితి.

తాజా ట్వీట్‌లో వైసీపీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదా అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు మీదా విమర్శలు చేశామనుకుని చంకలు గుద్దుకుంది.

‘సిగ్గులేని జీవితాలు.. నువ్వు.. మీ దత్త తండ్రి చంద్రబాబు ఇద్దరూ ఏపీకి దొరికిన జాతి రత్నాలు. ఎక్కడ ఏమి మాట్లాడతారో మీకే సోయ వుండదు. నందమూరి హరికృష్ణగారి భౌతిక దేహం వద్ద టీఆర్ఎస్‌తో పొత్తు గురించి మాట్లడతాడు చంద్రబాబు. నువ్వేమో మత్స్యకారుల పరామర్శకు వెళ్ళి, టీడీపీతో పొత్తెందుకు పెట్టుకున్నావో వివరిస్తావు. మీ ఇద్దరికీ సమయం, సందర్భం.. వేళా పాలా వుండదా.? ఇక్కడ కూడా ఓట్లు అడుగుతావా ప్యాకేజీ స్టార్.?’ అంటూ ట్వీటేసింది వైసీపీ.

సమయం, సందర్భం.. వేళా పాలా.. గురించి వైసీపీ మాట్లాడితే ఎలా.? అమ్మ ఒడి పథకం కావొచ్చు, విద్యా కానుక కావొచ్చు, ఇంకో సంక్షేమ పథకానికి సంబంధించిన నిధుల విడుదల తాలూకు బహిరంగ కావొచ్చు. అన్ని వేదికలపైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడేది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వ్యవహారం గురించే కదా.?

ఈ విషయమై ఇప్పటికే వైఎస్ జగన్ చాలా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాజకీయ విమర్శలకు, రాజకీయ వేదికలుంటాయ్. కానీ, ప్రజాధనం ఖర్చు చేసి నిర్వహించే అధికారిక బహిరంగ సభల్లో ఈ తరహా విమర్శలు, అందునా రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేయడమేంటో.!

ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ, వైసీపీని జనసేన సహా టీడీపీ విపరీతంగా ట్రోల్ చేస్తుండడం గమనార్హం. ఈ మధ్య చాలా ట్వీట్ల విషయంలో వైసీపీ ఇలాగే, సెల్ఫ్ గోల్ చేసుకుంటోంది.!