ఓటేయడానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం, ముగ్గురి మృతి

నల్లగొండ జిల్లాలో విషాదం జరిగింది. ఓటు వేయడానికి వెళ్తున్న ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్ల పల్లి మండలం పోల్కంపల్లికి చెందిన పోగుల సురేందర్ రెడ్డి, యాదమ్మ భార్య భర్తలు. వీరి కూతురును అదే గ్రామానికి చెందిన తిప్పన వెంకట్ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. వెంకట్ రెడ్డి హైదరాబాద్ లో ఉంటాడు. సురేందర్ రెడ్డి, యాదమ్మ 5 రోజుల క్రితం బిడ్డ దగ్గరకు వచ్చారు. వెంకట్ రెడ్డి పెద్ద అడిశర్లపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు.

వెంకట్ రెడ్డి హైదరాబాద్‌లో నివసిస్తున్న పోల్కంపల్లి గ్రామస్థులను ఓటు వేయడానికి రావాలని చెప్పి.. అత్తమామలు యాదమ్మ, సురేందర్‌రెడ్డి, స్నేహితుడు బొడ్డుపల్లి నర్సింహాచారి, అన్న కుమారుడు మహేందర్‌రెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. కొండ మల్లే పల్లి మండలం కేశ్యతండా వద్ద కారు అదుపు తప్పి విద్యుత్తు స్తంభానికి  ఢీకొట్టింది.   ఈ ప్రమాదంలో యాదమ్మ అక్కడికక్కడే చనిపోయింది. సురేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు.

రోడ్డు ప్రమాదంతో ఇరు కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. వెంకట్ రెడ్డి భార్య పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఓ వైపు తల్లిదండ్రులు, మరో వైపు భర్త మృతితో ఆమె తల్లడిల్లిపోతుంది. ఎన్నికల వేళ ఈ రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.