బైక్ పై వేగంగా వెళ్తూ కారు యాక్సిడెంట్ కు కారణమయ్యాడు..! వీడియో వైరల్

రోడ్డుపై వెళ్లేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటించాలని ఎన్నో అవేర్ నెస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలీసులు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోండి.. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. సేఫ్ గా వెళ్లండి.. ఇతరులను సేఫ్ గా ఉంచండి అంటూ ప్రకటనలు ఇస్తూంటారు. ఇంకా సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ.. ఇవేమీ పట్టని వాహనదారులు ఉన్నారు. అలా ఓ బైకర్ చేసిన తప్పిదం.. అతనితోపాటు ఎదురుగా వస్తున్న కారులోని వ్యక్తులకు కూడా ప్రమదం బారిన పడేలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. గుజరాత్ లోని సూరత్ కు దగ్గరలోని కొసాంబ పరిధిలో ఉన్న 8వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగింది.

హైవేపై ఓ వ్యక్తి బైక్ పై వెళ్తున్నాడు. తలకు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించుకుంటూ బైక్ పై వేగంగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయాడు. కానీ.. ఎదురుగా ఓ కారు వస్తోంది. బైక్ ని స్లో చేయలేక తప్పించనూ లేకపోయిన పరిస్థితుల్లో బైక్ పై వెళ్తూనే బైక్ పైనుంచి ఎడమ పక్కకు దూకేశాడు. బండి స్కిడ్ అయింది. అయితే.. ఎదురుగా వస్తున్న కారు ఆ బైక్ పైకి ఎక్కేసింది. కారు కూడా వేగంగా వస్తూండటంతో కారు కుడిపైపు టైర్ బైక్ పైకి ఎక్కి వేగం కంట్రోల్ కాలేక ముందుకెళ్లి రోడ్డు ఎడమ పక్కన బోల్తా కొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి రేగింది.

 

బైక్ పై వెళ్తున్న వ్యక్తి పడి లేచినా అతడికి గాయాలయ్యాయి. కారు బోల్తా పడటంతో అందులో ఉన్న వారికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటన అంతా అక్కడున్న సీసీ కెమేరాలో రికార్డైంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మార్చి 11న ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.