అప్పుడు హరికృష్ణ, ఇప్పుడు రవీందర్: నల్గొండలో అదే తరహాలో ప్రమాదం 

నల్గొండలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతేవాత పడటం ఇరు తెలుగు రాష్ట్రాల్లో అందరిని కలచివేసింది. ఇది జరిగి 20 రోజులు కూడా కాకముందే నల్గొండలో అదే తరహాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రవీందర్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. దీనిపై మరింత సమాచారం కింద ఉంది చూడండి.

ఈ కారు ప్రమాదం నల్గొండ జిల్లా, కట్టంగూరు గ్రామ సమీపంలో 65 నంబరు జాతీయ రహదారిపై జరిగింది. గోదావరిఖని చెందిన దాసరి లక్ష్మి నారాయణ కుటుంబసభ్యులతో కలిసి కారులో తిరుమల దర్శనానికి వెళ్లారు. దర్శనం ముగించుకుని హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లవారుజామున డ్రైవర్ అజాగ్రత్తతో కారు అతివేగంతో నడపడంతో కట్టంగూరు శివార్లలో కారు డివైడర్ ను ఢీ కొట్టింది. డివైడర్ ను ఢీ కొట్టిన కారు కుడివైపుకు వెళ్లి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది.

ఢీ కొట్టిన కారు హైద్రాబాదు నుండి వియజయవాడ వైపు వెళ్తోంది. ఆ కారులో ఉప్పల్ కు చెందిన తాటిపాముల రవీందర్ స్పాట్ లో ప్రాణాలు విడిచాడు. స్విఫ్ట్ డిజైర్ లో గోదావరిఖని చెందిన చకిలం సుమశ్రీ, చకిలం సంతోష, దాసరి రాజారత్నం, నాగేందర్ లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం నార్కట్ పల్లి కామినేని హాస్పిటల్ కి తరలించారు. కాగా మృతుడి భార్య తాటిపాముల పద్మ డ్రైవర్ లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేసారు. దీనిపై కట్టంగూరు పోలీసు అధికారులు విచారణ చేపడుతున్నట్టు సమాచారం.

ఒకసారి హరికృష్ణ కారు ప్రమాదం గుర్తు చేసుకుంటే అది కూడా తెల్లవారుఝామునే జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణం. హరికృష్ణ కారు కూడా డివైడర్ ను ఢీ కొట్టి అవతలివైపుకి వెళ్లి మరొక కారుని ఢీ కొట్టింది. అది కూడా నల్గొండ జిల్లాలోనే. కాకపోతే ఆ ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందగా…ఈ ప్రమాదంలో అవతలి కారులో ఉన్న వ్యక్తి చనిపోవడం బాధాకరం. అతివేగం ప్రమాదకరం. కారు నడుపుతున్నప్పుడు సీటు బెల్టు పెట్టుకోవడం తప్పనిసరి. అజాగ్రత్త వీడి అప్రమత్తంగా ఉండాలి. లేదంటే అప్పుడు హరికృష్ణ, ఇప్పుడు రవీందర్…రేపు? ఆగేదెప్పుడు?