కేరళ వరద బీభత్సం మరువకముందే ఏపీలో భారీ వర్షాలు మొదలయ్యాయి. అధికారులు పలు ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. వరద ముంపుకి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఇళ్లలోకి రోడ్లపైకి వరద నీరు చేరుకోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి, పరిసర ప్రాంతాలలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు అధికారులు. వర్షం ఇలాగే కొనసాగితే కొండవీటి వాగు ఉప్పొంగే అవకాశం ఉంది. ముంపు ప్రాంతంలోనే తాత్కాలిక రాష్ట్ర సచివాలయం కూడా ఉంది.
సచివాలయానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. వరద ఉధృతి పెరిగితే కొండవీటి వాగును ఎటు మరల్చాలో అనే ఆలోచనలో పడ్డారు అధికారులు. ఏ క్షణంలో అయినా కొండవీటి వాగు పొంగే అవకాశం ఉండటంతో తాడికొండ పోలీసులు ఇద్దరు కొండవీటి వాగు వద్ద పహారా కాస్తున్నారు.