రావణ దహనం కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. మృత్యువు రూపంలో వచ్చిన రైలు బండి 50 మందికి పైగా జనాలను బలి తీసుకున్నది. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో జరిగింది. దసరా పండుగ వారి జీవితాల్లో చీకటి నింపింది. పూర్తి వివరాలు, వీడియో కింద ఉన్నాయి చూడండి.
పంజాబ్ రాష్ట్రంలోని చౌరా బజార్ సమీపంలో రైలు యాక్సిడెంట్ జరిగింది. ఈ దుర్ఘటనలో 50 మందికి పైగా మరణించినట్లు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే చాన్స్ ఉందని అంటున్నారు. రైల్వే ట్రాక్ పక్కన రావణ దహనం కార్యక్రమం నిర్వహిస్తుండగా జనాలంతా పట్టాల మీద నుంచి వీక్షిస్తున్నారు. ఆ సమయంలో వారిపై హవ్ డా ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా దూసుకెళ్లింది. నకోదర్ నుంచి జలంధర్ వెళ్తున్న డిఎంయూ రైలు (నెంబరు 74943) వేగంగా దూసుకురావడంతో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
ప్రమాదం సమయంలో రైలు కూత వారికి రైలు కూత వినబడలేదు. బాంబుల మోత కారణంగా రైలు కూత వినబడలేదని, అందుకే ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి కారణమైందని చెబుతున్నారు. ఈ ఘోర ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న వారిని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రావణ దహనం కార్యక్రమ నిర్వాహకుల వైఫల్యం కారణంగానే ఇంత మంది మరణించారని స్థానికులు అంటున్నారు. రైలు వచ్చే సమయంలో అప్రమత్తం చేయడంలో వారు విపలమయ్యారని, పెద్ద ఎత్తున బాంబుల మోత ఉన్నందున రైలు శబ్దం వినబడలేదని అంటున్నారు.
అమృత్ సర్ లో రైలు ప్రమాదంపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి వైద్యం అందించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులను తెరిచి ఉంచాలని ఆయన ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.