అమృత తండ్రి మారుతీరావుకు ప్రణయ్ తమ్ముడైన అజయ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘అరే మారుతిరావ్ నువ్వు జైల్లోనే చచ్చిపో.. ఒకవేళ నువ్వు బయటకొస్తే జనాలే నిన్ను చంపేస్తారు రా నిన్ను.. నిన్ను, నీ తమ్ముడిని ఎవరినీ మిగలనివ్వరురా.. నిన్ను, నీ ఫ్యామిలీని నేను కానీ, నా ఫ్యామిలీ కానీ చంపరు.. జనాలే చంపేస్తార్రా’’ అని హచ్చరించాడు.
ఉక్రేయిన్ నుంచి అజయ్ ఆదివారం మధ్యాహ్నం ఇండియా చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా మిర్యాలగూడ చేరుకున్న అజయ్ తల్లిదండ్రులను, వదిన అమృతను చూసి భోరున విలపించాడు. వారిని గుండెలకు హత్తుకుని విలపించాడు.
ఈ సందర్భంగా అజయ్ మీడియాతో మాట్లాడారు. మారుతిరావు లాంటి సైకో తండ్రిని తాను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని అన్నారు. గతంలో అనేకసార్లు మారుతి కుటుంబం తమ కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేసిందన్నారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంత దారుణంగా చంపేస్తారా అని నిలదీశాడు.
ప్లాన్ ప్రకారమే ప్రణయ్ ని మారుతీరావు చంపించాడని అజయ్ ఆరోపించారు. మరోవైపు ప్రణయ్ అంత్యక్రియలు ఆదివారమే జరిపారు. ప్రణయ్ తమ్ముడు అజయ్ రాగానే అంత్యక్రియలు మొదలుపెట్టారు. అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో జనాలు పాల్గొన్నారు. దళిత సంఘాల సభ్యులు హాజరయ్యారు.
అంత్యక్రియల సందర్భంగా అమృత తన భర్త మృతదేహంపై పడి బోరున విలపించింది. ఆమె రోదన చూసి అక్కడికి వచ్చిన వారంతా కంటతడి పెట్టుకున్నారు. అంత్యక్రియలకు పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. అంతిమయాత్రకు జనాలు భారీగా వస్తారన్న అంచనాతో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.