మిర్యాలగూడ ఘటన( ప్రణయ్-అమృత లవ్ స్టోరీ) పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మర్డర్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆసినిమాకు సంబంధించిన రెండు పోస్టర్లను కూడా రిలీజ్ చేసి ఆసక్తి పెంచాడు. ఒక పోస్టర్ లో తల్లీ-కూతుళ్ల ప్రేమను ఎలివేట్ చేయగా, మరో పోస్టర్ లో తల్లి బిడ్డను ఎత్తుకుని మీడియా ముందు కన్నీళ్లు కారుస్తోన్నట్లుగా చూపించాడు. ఇక తొలి పోస్టర్ విడుదల కాగానే అమృత వర్మ తీరుపై మండిపడింది. కృంగిపోయిన తన జీవితంతో వర్మ ఆటలాడుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ పోస్టర్ చూస్తుంటే ఆత్మ చేసుకోవాలనిపిస్తుందని సెటైరికల్ గా స్పందించింది.
తన కథను సినిమాగా తీస్తోన్న భయపడనని, వర్మపై పోలీస్ కేసుగట్రా పెట్టనని, ఒకవేళ తనని కాదని ముందుకొచ్చినా ఎవరితోనూ అలాంటి ప్రయత్నం చేయించనని మాటిచ్చింది. అయితే అమృత ఇప్పుడా మాట తప్పినట్లు కనిపిస్తోంది. అమృత మావయ్య, ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసాడు. ఈ సినిమా తన కొడుకు హత్యా కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కోర్టును ఆశ్రయించాడు. నల్లగొండ ఎస్పీ, ఎస్టీ కోర్టులో ఈ మేరకు ఫిర్యాదు చేసాడు. ఈ నేపథ్యంలో వర్మపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దీంతో వర్మపై కేసు నమోదైనట్లు జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. వర్మతో పాటు సినిమా నిర్మాతలపైనా కేసు నమోదైంది. మరి ఈ కేసు గురించి వర్మ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. రోడ్ల పై భైఠాయించడాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులకు వెళ్లడం వర్మకు కొత్తేం కాదు. సినిమాల పరంగా, వ్యక్తి గతంగా వర్మ చాలా సార్లు పోలీస్ స్టేషన్లకు విచారణకు హాజరయ్యాడు. అవసరం మేర కోర్టులకు వెళ్లాడు. మరి తాజాగా వర్మపై నమోదైంది ఎస్సీ ఎస్టీ ఆట్రాసిటీ కేసు కాబట్టి కేసు కూడా బలంగానే ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.