ఐఫోన్ ఆర్డర్ పెట్టాడు… డబ్బు చెల్లించమంటే డెలివరీ బాయ్ పై దాడి చేసిన వ్యక్తి!

సాధారణంగా ఎప్పుడు చాలామంది ప్రతి ఒక్కటి ఆన్లైన్లో ఆర్డర్ పెడుతుంటారు. ఆ వస్తువులకు కొంతమంది ఆన్లైన్ ద్వారా ముందుగానే డబ్బు చెల్లిస్తారు. అయితే మరికొంతమంది ఆర్డర్ డెలివరీ ఇచ్చిన సమయంలో డబ్బు చెల్లిస్తారు. ఒకవేళ ఆ సమయానికి డబ్బు లేకపోయినా కూడా ఇతరుల వద్ద అప్పు చేసైన సరే డబ్బు కట్టాలి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఆన్లైన్ లో ఐఫోన్ ఆర్డర్ పెట్టి ఆ తర్వాత బిల్ చెల్లించకుండా డెలివరీ బాయ్ మీద దాడి చేసి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటక సంచలనంగా మారింది. చివరకు పోలిసులు నిందితుడిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

వివరాలలోకి వెళితే…కర్ణాటకలోని అరిష్ కేరే ప్రాంతానికి చెందిన హేమంత్ దత్ అనే వ్యక్తి ఆన్లైన్ లో ఐఫోన్ ఆర్డర్ పెట్టాడు.ఈ కార్ట్ ఎక్స్ ప్రెస్ లో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న నాయక్ సెకండ్ ఐ ఫోన్ డెలివరీ ఇచ్చేందుకు హేమంత్ ఇంటికి చేరుకున్నాడు. అయితే ఐఫోన్ తీసుకున్న హేమంత్, దానికి రూ.45,000లను కట్టేందుకు నిరాకరించడంతో డబ్బు కట్టాలని నాయక్ అతడిని నిలదీశాడు. దీంతో హేమంత్ అతని మీద విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చాడు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని ఇంట్లోనే నాలుగు రోజులు ఉంచుకున్నాడు. ఎవరికీ అనుమానం రాలేదని నిర్ధారించుకున్నాక ఆ మృతదేహాన్ని గోనె సంచిలో కట్టేసి బైక్ పైన స్థానిక రైల్వే స్టేషన్ కు తీసుకువెళ్లి తగలబెట్టేశాడు.

ఐ ఫోన్ డెలివరీ కోసం లక్ష్మీపురా లేఅవుట్ కు వెళ్లిన నాయక్ కనిపించకుండా పోవటంతో అతని కుటుంబసభ్యులతో పాటు ఈ కార్ట్ సంస్థ యజమాని కూడా పోలిసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఫిబ్రవరీ 11న స్థానిక రైల్వే స్టేషన్ పక్కన సగం కాలిన నాయక్ మృతదేహాన్ని గుర్తించారు. ఐ ఫోన్ డెలివరీ కోసం లక్ష్మీపురా లేఅవుట్ కు వెళ్లిన తరువాత నాయక్ కనిపించకుండా పోయాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ మేరకు దర్యప్తు చేసి అరిష్ కేరే ప్రాంతానికి చెందిన హేమంత్ దత్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు డెలివరీ బాయ్ ను తానే హత్యచేసినట్లు అంగీకరించాడు. ఈ మేరకు హేమంత్ మృతదేహాన్ని బైక్ పై తీసుకువెళ్లడం సీసీటీవీల్లో రియార్డ్ అవ్వడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.