బెజవాడ సెక్స్ రాకెట్ కలకలం

విజయవాడలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.  ఆన్ లైన్ సెక్స్ రాకెట్ కలకలం రేపుతోంది. మహిళల ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. అమాయక మహిళల ఫోటోలను వ్యభిచారులుగా  సోషల్ మీడియాలో పెట్టి డబ్బులు దండుకుని మాయమయ్యే ముఠా గుట్టు బయట పడింది.

సోషల్ మీడియాలో వ్యభిచారిగా తన ఫోటో ఉన్నట్టు గుర్తించిన యువతి విజయవాడ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ బండారం బయట పడింది. ఒక యువతి ఇచ్చిన కంప్లైంట్ తో విచారణ చేపట్టారు పోలీసులు.

గుంటూరుకు చెందిన రాజేశ్వరి అనే మహిళ తన అల్లుడితో కలిసి ఈ మోసాలకు పాల్పడుతోందని పోలీసులు కనిపెట్టారు. ఆ ఆన్ లైన్ వ్యభిచార ముఠా ఇప్పటివరకు ఇటువంటి మోసాలు చేసి 20 లక్షలు సంపాదించినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. వీరిపై సెక్షన్ 420, సైబర్ నేరాల కింద కేసు నమోదు చేసారు అధికారులు.

సోషల్ మీడియాలో యువతులు పబ్లిక్ గా పెడుతున్న ఫోటోలు తీసుకుని, వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపులలో వ్యభిచారులుగా చూపిస్తోంది రాజేశ్వరి. ఫోటోను బట్టి రేటు ఫిక్స్ చేసి ఆన్ లైన్ లో వ్యక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తుంది. ఇందుకోసం ఆమె 5 ఫేక్ బ్యాంకు అకౌంట్స్ నిర్వహిస్తుందని తేలింది.  సుమారు 30 నుండి 50 మంది యువతుల ఫోటోలను ఈవిధంగా అప్లోడ్ చేసినట్టు తెలుస్తోంది. 

 వ్యభిచారిగా చిత్రీకరిస్తూ విజయవాడకు చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ ఫోటో సోషల్ మీడియాలో పెట్టింది రాజేశ్వరి. తెలిసిన వ్యక్తులు ఈ విషయం ఆ యువతికి తెలుపగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కృష్ణలంక పోలీసులు గుంటూరు వెళ్లి రాజేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరాలలో ఆమెకు సహకరిస్తున్న ఆమె అల్లుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అనేక కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

దీనివెనుక ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా లేక వీరిద్దరే చేస్తున్నారా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే విజవాడలో తొలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రారంభించారు డీజీపీ ఆర్పీ ఠాకూర్. త్వరలోనే డీఎస్పీని నియమించి సైబర్ క్రైమ్ కేసులను త్వరితగతిలో అరికడతామని చెబుతున్నారు అధికారులు. 

యువతులు తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు అందంగా ఉన్న మహిళల అమ్మాయిల ఫోటోలు తీసుకుని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు వెల్లడించారు. సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న నేపథ్యంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.