విశాఖ ఎయిర్‌పోర్టులో ఈ నెల 25 న జగన్ పై జరిగిన హత్యాయత్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే విశాఖ ఎయిర్‌పోర్టు అడ్డాగా జరిగిన ఈ ఘటన షాక్ కి గురి చేసింది. గత ఐదు రోజులుగా విశాఖ ఎయిర్పోర్టు వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇదే విశాఖ ఎయిర్పోర్టు వేదికగా మరో క్రైమ్ కి పాల్పడ్డారు కొందరు కేటుగాళ్లు. అధికారుల కళ్ళు గప్పి అక్రమ రవాణా యత్నానికి పాల్పడ్డారు. దీనిపై పూర్తి సమాచారం కింద ఉండి చదవండి.
కడుపులో బంగారాన్ని దాచి అక్రమంగా తరలించాలని ముగ్గురు వ్యక్తులు పన్నాగం పన్నారు. అయితే వారి ప్లాన్ బెడిసికొట్టింది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయారు. ఆ ముఠా పన్నాగాన్ని అధికారులు తిప్పి కొట్టారు. నిందితులను పట్టుకుని ఆసుపత్రికి తరలించి వారి కడుపులో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
శనివారం రాత్రి మలేషియా నుండి విశాఖకు వచ్చారు ఆ ముగ్గురు నిందితులు. వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఆ ముగ్గురు నిందితుల్ని వైద్య పరీక్షల నిమిత్తం కెజిహెచ్ కు పంపారు. పరీక్షల్లో ఇద్దరు వ్యక్తుల కడుపులో బంగారం ఉన్నట్టు తేలింది. వైద్యుల సహాయంతో పొట్టలో దాచిన బంగారాన్ని వెలికి తీయించారు. కాగా ఆ ముగ్గురు తమిళనాడు ప్రాంతానికి చెందినవారిగా అధికారుల ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిసింది.
జగన్ పై దాడి విశాఖ ఎయిర్పోర్టులోనే జరిగింది. ఈ ఘటనతో ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది మరింత అలెర్ట్ గా ఉంటున్నారు. ఇప్పటికే కోడి కత్తిని లోపలికి ఎలా అనుమతిచ్చారంటూ ఎయిర్పోర్ట్ భద్రతా వ్యవస్థపైన పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. అనుమానితులపై నిఘా పెంచారు.