బ్యూటిషియన్ పద్మ కేసులో మరో ట్విస్ట్ (వీడియో)

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో బ్యూటిషియన్ పద్మ పై జరిగిన దాడి కేసులో పోలీసులే విస్తుపోయే ట్విస్టు ఇది.  ఆమెను హత్య చేయాలని చూసి దారుణంగా ప్రవర్తించిన నూతన్ కుమార్ రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తొలుత భావించినా అతన్ని ఎవరో హత్య చేసి పట్టాలపై పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పద్మ తన వాంగ్మూలంలో సుబ్బయ్య అనే వ్యక్తి పేరు చెప్పగా అతను ఎవరనే విషయంపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో సుబ్బయ్య కీలకంగా మారే అవకాశం ఉంది.

పద్మ ప్రియుడు నూతన్ కుమార్ వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా ఆయన భార్యకు సమాచారం ఇవ్వగా అతను తన భర్తేనని ఆమె గుర్తించింది. నూతన్ ను సుబ్బయ్య హత్య చేసి ఉండవచ్చన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పద్మ చేతిపై ఉన్న “ఎన్” అనే పచ్చబొట్టును చెరిపివేయడం, పద్మ నుదుటిపై “ఎస్” అనే అక్షరం రాయడం వెనుక ఉన్న మిస్టరీ సుబ్బయ్యను అరెస్టు చేస్తే వీడుతుందని పోలీసులు అంటున్నారు. ఎస్ అంటే సుబ్బయ్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా నూతన్ తో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న పద్మ అతనితో విబేధాలు రావడంతో గతంలో హనుమాన్ జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి ఫిర్యాదును కూడా పోలీసులు విచారిస్తున్నారు.

సుబ్బయ్య అనే వ్యక్తి కూడా పద్మతో సంబంధం పెట్టుకున్నాడా, వారికి బెడిసికొట్టి సుబ్బయ్య ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సుబ్బయ్యే నూతన్ ను చంపి పద్మను కూడా చంపడానికి యత్నించాడనే కోణంలో విచారణ జరుగుతోంది. పద్మ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమె ఎడమ చేతిని వైద్యులు తొలగించారు. ఆమె అవయవాలు ఇంకా పూర్తి స్థాయి చికిత్సకు సహకరించడం లేదు. పద్మ కోలుకోని ఈ సుబ్బయ్ కథ చెబితే ఈ కేసు మిస్టరీ వీడుతుందని పోలీసులు అంటున్నారు. గత నాలుగు రోజులుగా రోజుకో మలుపు తిరుగుతూ కేసు ట్వీస్టులను ఇస్తుండటంతో పోలీసులు కూడా డైలమాలో పడ్డారని తెలుస్తోంది. పోలీసు అధికారులు కూడా సీరియస్ గా తీసుకోవడంతో సుబ్బయ్య అనే అనుమానితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పద్మ గాయపడ్డ వీడియో కింద ఉంది.