బ్యూటిషియన్ పై దాడి కేసులో కొత్త ట్విస్ట్ (వీడియో)

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో  ఓ బ్యూటిషియన్ పై జరిగిన హత్యాయత్నం కేసు పలు మలుపులు తిరుగుతుంది. బ్యూటిషియన్ పద్మను కాళ్లు, చేతులు కట్టేసి చేతులను అత్యంత క్రూరంగా నరికి ముఖానికి కవర్ చుట్టి అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన భయభ్రాంతులకు గురి చేసింది. ఇరుగుపొరుగు వాళ్లకు ఆమె అరుపులు వినిపించకుండా మత్తు ఇంజక్షన్ ఇచ్చి పైశాచికంగా హత్యాయత్నం చేశారు. మహిళ శరీరంపై విచక్షణరహితంగా కత్తిపోట్లు పొడిచి శాడిజాన్ని చూపించాడు. హత్యాయత్నం చేసిన వారు పరారైన తర్వాత బాధితురాలు దాదాపు 36 గంటల పాటు మృత్యువుతో పోరాడింది. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగానే ఉంది.

పద్మ, నూతన్ కుమార్

రాజమండ్రికి చెందిన పల్లె పద్మ , సూర్యనారాయణలకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల పాటు హైదరాబాద్ లో ఉన్న వీరు సూర్యనారాయణకు ఓ కంపెనీలో ఉద్యోగం రావడంతో  హనుమాన్ జంక్షన్ కు వచ్చారు. అప్పటి వరకు సాఫీగా సాగిన వీరి సంసారంలో కలతలు మొదలయ్యాయి. దీంతో ఇద్దరు వీడిపోయి వేరువేరుగా ఉంటున్నారు.

భర్తకు దూరంగా ఉంటున్న పద్మకు ఏలూరులోని వెన్నవల్లి వారి వీధికి చెందిన బత్తుల నూతన్ కుమార్ విక్టర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. పద్మ ఓ బ్యూటిపార్లర్ లో పనిచేస్తుంది. నూతన్ కుమార్ ఓ మార్కెటింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జీక్యూటివ్ గా పనిచేస్తున్నారు. 20 రోజుల క్రితం తారకరామ కాలనీ సమీపంలో  ఓ ఇంట్లో వీరు అద్దెకు దిగారు. ఈ నెల 23న వీరిద్దరికి మధ్య గొడవ జరిగింది. ఆర్ధిక మరియు  వివాహేతర సంబందం  దెబ్బతినడం వల్లే గొడవ జరిగినట్టు తెలుస్తోంది.

దీంతో నూతన్ కుమార్ పథకం ప్రకారమే పద్మకు మత్తు సూది ఇచ్చి ఆమె మత్తులోకి వెళ్లాక ఆమె చేతులు కాళ్లు కట్టేశాడు. ఆమె పై కత్తితో దాడి చేసి చేతులు కాళ్లు నరికి, ముఖానికి కవర్ కట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. దీన స్థితిలో ఉన్న పద్మను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. పద్మ స్థితిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నూతన్ కుమార్ కోసం గాలిస్తున్నారు. పద్మపై పాశవికంగా దాడి చేయడంతో పద్మ దీనస్థితి కింది వీడియోలో ఉంది చూడండి.