బ్యూటీషియన్ కేసులో షాకింగ్ ట్విస్ట్

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో బ్యూటీషియన్ ని కాళ్ళు, చేతులు నరికి చంపడానికి ప్రయత్నించిన ఘటన రాష్ట్రమంతటా చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బ్యూటీషియన్ పల్లె పద్మ పరిస్థితి విషమంగా ఉంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పద్మ తనని చంపడానికి ప్రయత్నించింది ఎవరో చెప్పింది. ప్రియుడే ఆమెను అత్యంత కిరాతకంగా చంపడానికి పాల్పడ్డాడు. ఆమెపై దాడి చేసిన తర్వాత ప్రియుడు నూతన్ కుమార్ అక్కడి నుండి పరారయ్యాడు.

పరారీలో ఉన్న నిందితుడు నూతన్ కుమార్ ని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన్ కుమార్ శవమై కనిపించాడు. బ్యూటీషియన్ పై దాడి చేసిన అనంతరం పరారీలో ఉన్న నూతన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు నుంచి నరసరావుపేట వెళ్లే మార్గంలో రైలు కింద పడి మరణించాడు. రైలు పట్టాలపై ఉన్న శవాన్ని చూసి నూతన్ కుమార్ గా నిర్ధారించారు హనుమాన్ జంక్షన్ పోలీసులు.

రాజమండ్రికి చెందిన పల్లె పద్మ , సూర్యనారాయణలకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల పాటు హైదరాబాద్ లో ఉన్న వీరు సూర్యనారాయణకు ఓ కంపెనీలో ఉద్యోగం రావడంతో  హనుమాన్ జంక్షన్ కు వచ్చారు. అప్పటి వరకు సాఫీగా సాగిన వీరి సంసారంలో కలతలు మొదలయ్యాయి. దీంతో ఇద్దరు వీడిపోయి వేరువేరుగా ఉంటున్నారు.

భర్తకు దూరంగా ఉంటున్న పద్మకు ఏలూరులోని వెన్నవల్లి వారి వీధికి చెందిన బత్తుల నూతన్ కుమార్ విక్టర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. పద్మ ఓ బ్యూటిపార్లర్ లో పనిచేస్తుంది. నూతన్ కుమార్ ఓ మార్కెటింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జీక్యూటివ్ గా పనిచేస్తున్నారు. 20 రోజుల క్రితం తారకరామ కాలనీ సమీపంలో  ఓ ఇంట్లో వీరు అద్దెకు దిగారు. ఈ నెల 23న వీరిద్దరికి మధ్య గొడవ జరిగింది. ఆర్ధిక మరియు  వివాహేతర సంబందం  దెబ్బతినడం వల్లే గొడవ జరిగినట్టు తెలుస్తోంది.

దీంతో నూతన్ కుమార్ పథకం ప్రకారమే పద్మకు మత్తు సూది ఇచ్చి ఆమె మత్తులోకి వెళ్లాక ఆమె చేతులు కాళ్లు కట్టేశాడు. ఆమె పై కత్తితో దాడి చేసి చేతులు కాళ్లు నరికి, ముఖానికి కవర్ కట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. దీన స్థితిలో ఉన్న పద్మను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. పద్మ స్థితిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.