Amaravathi Jhalak : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. నిజానికి, ఆయన వైఎస్ జగన్ తొలి క్యాబినెట్‌లోనే మంత్రి అవ్వాల్సి వుంది.
కానీ, కొన్ని సమీకరణాల నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి ఆ అవకాశం దక్కించుకోలేకపోయారు. పోనీ, రెండోసారి అయినా ఆ అవకాశం దక్కుతుందా.? అంటే, అదీ లేదాయె.
మంత్రి హోదాలో గడప గడపకూ వెళ్ళాలనుకున్న శ్రీధర్ రెడ్డి, చేసేది లేక.. దిగాలుగా ఎమ్మెల్యే హోదాలోనే ఆ పని నేటి నుంచి ప్రారంభించారు. ‘తీవ్రమైన అసంతృప్తి వుంది.. చాలా చాలా ఆవేదన వుంది.. బాధ కాదు, అంతకు మించిన మనో వేదన..’ అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాపోతున్నారు.
‘ఇలా జరుగతుందని అనుకోలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి భక్తుడిని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నమ్మిన బంటుని.. కానీ, నాకే అన్యాయం జరిగింది.. ఎందుకు జరిగిందో అర్థం కావడంలేదు..’ అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
నిజానికి, ఎట్టి పరిస్థితుల్లోనూ కోటంరెడ్డికి మంత్రి పదవి దక్కి వుండేదే. కానీ, ఆయన చేసిన ఒకే ఒక్క తప్పు.. మంత్రి పదవిని ఆయనకు దూరం చేసిందట. అదేంటంటే, అమరావతి రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర.. అంటూ మహా పాదయాత్ర చేసినప్పుడు.. ఆ రైతులకు తన నియోజకవర్గంలో కోటంరెడ్డి నుంచి పలకరింపు వెళ్ళడమే.
‘నా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి, వారి రక్షణ బాద్యత నాది. ఆహారం వంటి వాటి విషయాల్లో నేను చూసుకుంటాను.. మా పార్టీ విధానం మూడు రాజధానులే.. ఈ విషయంలో వారితో విభేదిస్తాను.. అయినాగానీ, సాటి మనిషిగా.. ఓ ప్రజా ప్రతినిథిగా.. నాకూ బాధ్యతలుంటాయ్..’
అని వ్యాఖ్యానించారు అప్పట్లో కోటంరెడ్డి. ఆయన తీరు పట్ల వైసీపీలో అప్పట్లోనే విమర్శలొచ్చాయి.
సో, అమరావతి కోటాలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వైఎస్ జగన్ షాకిచ్చారని అనుకోవచ్చేమో.