టీడీపీలో అలజడి: అతి సర్వత్ర వర్జయేత్!

అతి సర్వత్ర వర్జయేత్.. ఏ విషయంలోనూ అతి మంచిది కాదు. వెనకా ముందూ చూసుకోకుండా.. అతి చేస్తే.. వ్యవహారం కాస్తా రివర్స్ అయిపోద్ది! ప్రస్తుతం టీడీపీలో ఇదే జరుగుతుందని అంటున్నారు తమ్ముళ్లు! అందుకు కారణమైంది 2024లో టీడీపీ క్యాబినెట్ ఇదే అంటూ వైరల్ చేస్తున్న ఒక పోస్ట్!

ఆలూ లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్లుగా చేస్తున్నారు తమ్ముళ్లు. ఎన్నికలు జరిగిందీ లేదు.. జనాలు జగన్ కంటే బాబుని ఎక్కువగా నమ్మేసిందీ లేదు.. ఓట్లు వేసేసిందీ లేదు.. గెలిచిందీ లేదు.. ఇంతలోనే.. రాబోయే కాలంలో టీడీపీ ప్రభుత్వంలో – కాబోయే క్యాబినెట్ ఇదే అంటూ హడావిడి చేస్తున్నారు!

అందులో భాగంగా.. ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం – ఐటీ ప‌రిశ్ర‌మ‌ల మంత్రివర్యులుగా నారా లోకేష్‌, ఆర్థిక మంత్రిగా – య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు.. ఇక, హోం మంత్రిగా కింజ‌రాపు అచ్చెన్నాయుడు ప్రధానంగా ఉంటారంట.

అనంతరం… మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వంగ‌ల‌పూడి అనిత‌, ప‌శుసంవ‌ర్థ‌క శాఖ మంత్రిగా ఏలూరి సాంబ‌శివ‌రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బీద ర‌విచంద్ర‌, విద్యా శాఖా మంత్రిగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, వ్య‌వ‌సాయం – పాడిపరిశ్రమల శాఖా మంత్రిగా కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, రోడ్లు భ‌వ‌నాల శాఖా మాత్యులుగా అమ‌ర్నాథ్‌ రెడ్డి, ర‌వాణా శాఖకు ఆనం రామ‌నారాయ‌ణ‌ రెడ్డి గ‌నుల శాఖకు ప‌రిటాల సునీత‌, మైనార్టీ సంక్షేమ శాఖకు అజీజ్‌ అంట!

టీడీపీకి హైప్ తీసుకురావాలనే ఆత్రంలో చేసిన ఈ తుత్తర పని వల్ల… పైన పేర్కొన్న లిస్ట్ లో పేర్లు లేనివారి అనుచరులు మాత్రం.. పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టొద్దు – ఇంకెప్పుడూ అవే పేర్లా.. కొత్తవారికి ఛాన్స్ లు ఇవ్వరా.. అంటూ మండిపడుతున్నారంట. ఈ పోస్టులు సరదాకి పెట్టినవైతే కావని.. టీడీపీ అధికారంలోకి వచ్చేసుందనే ఫాల్స్ హైప్ తీసుకురావడం కోసం చేసిన ఒక చిల్లర ప్రయత్నమని అంటున్నారు!!

దీంతో… అసలే లేదంటే ఏమిటి ఈ పనికిమాలిన పంచాయతీలు అని కొందరు నేతలు ఫీలవుతున్నారంట. విచిత్రం ఏమిటంటే.. రాబోయే ఎన్నికల్లో ఈ టీడీపీ కలల కేబినెట్ లో క్యాండిడేట్లు అందరూ గెలుస్తారా లేదా అన్నది!! మరో విచిత్రం ఏమిటంటే… “ఇలా అయినా సంతోషపడనివ్వండి” అని వైకాపా కేడర్ సెటైర్లు వేయడం!!

సరే అంతవరకూ బాగానే ఉంది అనుకుంటే… ఈ కేబినెట్ లిస్ట్ లో ఎక్కడా జనసేన ప్రస్థావన లేకపోవడం!!!