నెల్లూరు జిల్లా అధికారపార్టీ ఎంఎల్ఏల మధ్య రాజకీయ చిచ్చు మొదలైంది. మొన్నటి ఎన్నికల వరకూ ఐకమత్యంతో కలిసి మెలసి ఉన్న ఎంఎల్ఏల మద్య ఇపుడు వివాదాలు ప్రారంభమవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో వైసిపి పదికి పది సీట్లను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.
అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఏకైక ఎంపి సీటును కూడా వైసిపి గెలుచుకుంది. నిజానికి ఎంఎల్ఏల మధ్య చిచ్చుకు మొన్నటి ఎన్నికల ఫలితాలు కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. మొదటి నుండి బాగా సన్నిహితులుగా ఉన్న నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్వేపల్లి ఎంఎల్ఏ కాకాణి గోవర్ధనరెడ్డి మధ్య చిచ్చుకు ప్రధాన కారణం ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డే అని సమాచారం.
కోటంరెడ్డి తన మద్దతుదారులతో తన ఇంటికి వచ్చి ధౌర్జన్యం చేశారంటూ ఎంపిడివో సరళ ఆరోపణలు చేయటం కలకలం మొదలైంది. సరే ఇద్దరిలో తప్పెవరిదో స్పష్టంగా తెలీదు. అయినా ముందైతే పోలీసులు కోటంరెడ్డిపై కేసు పెట్టటం, అరెస్టు చేసి బెయిల్ ఇవ్వటం సంచలనంగా మారింది.
పైకి చూస్తే గొడవ కోటంరెడ్డి-ఎంపిడివోకు మధ్యగానే కనిపిస్తుంది కానీ సరళ వెనకున్నది ఆదాల, కాకాణి అనే ప్రచారం జరుగుతోంది. ఆదాల, కోటంరెడ్డికి ఉన్న వ్యక్తిగత విభేదాలను కాకాణి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారనే ప్రచారం పార్టీలో మొదలైంది. టిడిపిలో నుండి వైసిపిలో చేరి ఎంపిగా గెలిచిన ఆదాలే ఎంఎల్ఏలిద్దరి మధ్య చిచ్చుకు ప్రధాన కారణమనే ఆరోపణలు వినబడుతున్నాయి. మరి ఈ వివాదాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సిందే