నిండు గర్భిణి పట్ల వైద్యుల నిర్లక్ష్యం.. పురిటిలోనే ప్రాణాలు కోల్పోయిన శిశువు…!

ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో ప్రాణాలు కాపాడే డాక్టర్లను ప్రజలు దేవుడితో సమానంగా భావిస్తారు కానీ కొంతమంది వైద్యులు రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు రోగుల పట్ల వ్యవహరించే తీరు వల్ల రోగులు కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇటీవల ఇటువంటి ఘటన మెట్ పల్లిలో వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే…ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన సుజాత (22) అనే గర్భిణీ డెలివరీ సమయం దగ్గర పడటంతో డెలివరీ కోసం గత సోమవారం మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. గత మూడు రోజులుగా సుజాత పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న కూడా డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అవి పురిటి నొప్పులు కాదని చెప్పారు. కానీ బుధవారం మాత్రం గర్భిణికి సిజరింగ్ చేసి శిశువుని బయటికి తీశారు. అయితే డెలివరీ చేయడం ఆలస్యం కావడంతో బిడ్డ గర్భంలోనే మృతి చెందింది.

దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు, ఆమె భర్త వైద్యుల నిర్లక్ష్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో సమయానికి వైద్యులు అందుబాటు లేకపోవడం వల్లే తమ బిడ్డ పురిటిలోనే ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న మెట్‌పల్లి సీఐ శ్రీను తన సిబ్బందితో వచ్చి బాధితురాలికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు.