హస్టళ్లలో చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన యాదాద్రి జిల్లాలో చర్చనీయాంశమైంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మేగ్యా తండాకు చెందిన కేతావత్ భాస్కర్, బుజ్జి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అనారోగ్యంతో భాస్కర్ మూడు సంవత్సరాల క్రితం చనిపోయాడు. వీరి కూతురు బిందు ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలోని బ్యాక్ టూ బ్యాక్ నే క్రిస్టియన్ స్వచ్చంద సంస్థ వసతి గృహంలో ఉంటుంది. ఆ సంస్థ వారే వీరిని ఆలేరులోని జెఎంజె పాఠశాలలో చదివిస్తున్నారు.
శుక్రవారం ఉదయం నిద్రలేచిన బిందు వాష్ రూంకు వెళ్లింది. ఎంత సేపటికి కూడా బిందు బయటికి రాకపోవడంతో స్నేహితులు మేనేజర్ దేవదాసుకు విషయం చెప్పారు. ఆయన వచ్చి చూసేలోగా బిందు లోపల కింద పడిపోయి ఉంది. వెంటనే అంబులెన్స్ లో ఆమెను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బిందు చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. హస్టల్ నిర్వాకుల వల్లనే బిందు చనిపోయిందని బంధువులు ఆందోళన నిర్వహించారు. పోలీసులు సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు.
బిందు మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విద్యార్ది సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎటువంటి అనారోగ్యం లేని బిందు పై ఎవరైనా అఘాయిత్యం చేసి హత్య చేశారా లేక ఏ కారణంతోనైనా హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే కానీ అసలు నిజాలు తెలిసేలా లేదని బిందు మృతి పై వాస్తవాలు వెలికి తీయాలన్నారు. దోషుల పై చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
మోత్కురులోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 6వ తరగతి అమ్మాయి ఊహ ఆకస్మాతుగా మృతి చెందింది. శుక్రవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత ఊహ హాస్టల్ లోకి వెళుతూ కిందపడిపోయింది. గమనించిన ఉపాధ్యాయులు ఆమెను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. ఊహ స్వస్థలం సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరు. ఏల ఉప్పలయ్య, శ్యామల దంపతుల పెద్ద కుమార్తె ఊహ. చిన్న తనంలోనే కూతురు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.