దేశ ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద బస్సు ప్రమాదమిదే

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 51 మంది చనిపోయారు. ఈ ప్రమాదం దేశ ఆర్టీసి చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదంగా అధికారులు తెలిపారు. జగిత్యాల ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 80 మంది ప్రయాణికులతో కొండగట్టు నుంచి ఘాట్ రోడ్డులో కిందికి బయల్దేరింది. బస్సు ప్రమాదంపై భిన్న రకాల కారణాలు వినిపిస్తున్నాయి.

బస్సు ప్రమాదానికి గురైన తీరును చూస్తే బస్సు ఘాట్ రోడ్డులోని చివరి మూలమలుపు వద్ద ప్రమాదానికి గురైంది. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. అయితే డ్రైవర్ దానిని గమనించకుండా వేగంగా బస్సును నడపడంతో వెనుక నిలబడ్డ ప్రయాణికులంతా ముందుకు రావడంతో బస్సుకు ఒక సైడ్ బరువు ఎక్కువై పక్కకు ఒరిగింది దీంతో పక్కనే ఉన్న లోయలోకి బస్సు రెయిలింగ్ ను దూసుకుంటూ వెళ్లి పల్టీలు కొట్టింది. ఆ సమయంలో ఒకరిపై ఒకరు పడటంతో ఊపిరాడకుండా చాలా మంది చనిపోయారు. బలమైన రాళ్ల మీద బస్సు పడటంతో బలంగా దెబ్బలు తాకి మరికొంత మంది చనిపోయారు.

ప్రమాద స్థలంలో హృదయ విదారక దృశ్యాలు

బస్సు ప్రమాద సమయంలో నూటల్ లో ఉందని ఒంపు రోడ్డులో నూటల్ లో వాహనాన్ని నడిపితే బ్రేక్ కంట్రోల్ కాకుండా ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని పలువురు అంటున్నారు. బస్సు ప్రమాద సమయంలో నూటల్ లో ఉన్నట్టు తెలుస్తోంది. డ్రైవర్ కి ఈ రూట్ పై అవగాహన లేకపోవడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. డ్రైవర్ ప్రమాద సమయంలో తాగి ఉన్నాడని అధికారులు చెబుతున్నారు. మృతుల్లో 32 మంది మహిళలు, 15 మంది పురుషులు, 4గురు చిన్నారులున్నారు.

శనివారపు పేట నుంచి జగిత్యాల వెళ్లే మార్గం అసలు ఇది కాదని ఈ మార్గంలో వెళితే ఎక్కువ మంది ఎక్కుతారనే ఆశతో బస్సు ఈ మార్గం ద్వారా తీసుకొచ్చారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అసలు వెళ్లాల్సిన మార్గంలో వెళితే ఈ ప్రమాదం జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు వెళ్లిన రూట్ కేవలం భక్తులు వెళ్లేందుకు వేసిన ఘాట్ రూట్ అని , ఆర్టీసీ సర్వీసు రూట్ కాకపోయినా బస్సు ఈ మార్గంలో వచ్చిందన్నారు.

జగిత్యాల డిపో మేనేజర్ ఈ రూట్ లో బస్సులు నడిపేందుకు అనుమతివ్వడంతో గత కొద్ది రోజులుగా ఇటు వైపు బస్సులు నడుస్తున్నాయని ఆర్టీసీ కాసుల కక్కుర్తికి 51 మంది ప్రాణాలు బలయ్యాయని పలువురు వాపోయారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షలు, ఆర్టీసీ తరపున 3 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను సీఎం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.