మృత్యువుతో పోరాడి ఓడిన కొండగట్టు ప్రమాద బాధితురాలు వనితారెడ్డి

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ప్రమాదంలో మృతుల సంఖ్య  65కి చేరింది. దేశ  ఆర్టీసీ చరిత్రలోనే ఘోరమైన రోడ్డు ప్రమాదమది. సెప్టెంబర్ 11 వతేది 60 కుటుంబాల్లో చీకటిని నింపింది. ఎన్నో ఇండ్ల దీపాలు ఆరిపోయాయి. ఎందరో ఆధారాలు లేక రోడ్డున పడ్డారు. తాజాగా మరణించిన సురుకంటి వనిత మరణం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

సెప్టెంబర్ 11న కొండగట్టు దిగుతుండగా ఆర్టీసి బస్సు ప్రమాదానికి గురై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తం 65 మంది చనిపోయారు. సురుకంటి వనిత పుట్టినిల్లు జగిత్యాల మండలం మోతె గ్రామం. ఈమెకు కొడిమ్యాల మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో సంజీవరెడ్డితో వివాహం అయ్యింది. వీరికి కుమారుడు అజిత్ రెడ్డి ఉన్నాడు. సంజీవరెడ్డి సింగపూర్ లో ఓ కంపెనీలో పని చేస్తుండేవాడు. వనిత గ్రామంలో సాక్షర భారత్ కో ఆర్డినేటర్ గా పని  చేస్తుంది.  

సెప్టెంబర్ 11న జగిత్యాలలో మీటింగ్ ఉండడంతో బస్సులో వనిత జగిత్యాలకు బయల్దేరింది. ఇంతలోనే ఘోరమైన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వనితను ముందుగా హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కరీంనగర్ లోని ప్రతిమ ఆసుపత్రిలో చికిత్సనందించారు. వనిత కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో వైద్యుల సూచనతో ఇంటి దగ్గరే ఆమెకు చికిత్సనందించారు. కానీ వనిత పరిస్థితిలో మార్పు రాలేదు. 

ప్రమాదానికి ముందు వనితా రెడ్డి, విగతజీవిగా మారిన వనితా రెడ్డి

వనితకు చికిత్స అందే సమయంలో భర్త సింగపూర్ నుంచి పని వదులుకొని వచ్చి భార్యకు సపర్యలు చేశాడు. వనిత కోమాలో ఉండడంతో చిన్న పిల్లలాగా ఆమెకు సేవలు చేశాడు అయినా కూడా వనిత దక్కలేదు. పరిస్థితి విషమించడంతో ఇంట్లోనే వనిత కన్నుమూసింది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. వనిత మరణించడంతో భర్త, కొడుకు పరిస్థితి ఏంటని అంతా కన్నీరుమున్నీరయ్యారు. వనిత అందరితో చాలా కలివిడిగా ఉండేదని అకాల మరణం చెందడం తట్టుకోలేకపోతున్నామని తోటి ఉద్యోగులు విలపించారు.

వనిత కుటుంబాన్ని జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. వనిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన 8 లక్షల రూపాయల సహాయాన్ని త్వరగా అందజేయాలని ప్రైవేటు ఆస్పత్రులలో చెల్లించిన డబ్బులను కూడా ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.