ఒక ఇంట్లో కవర్లో పెట్టిన పదిలక్షలు అనూహ్యంగా మాయమయ్యాయి. డబ్బులు లేకపోవడం గమనించిన ఇంటి యజమాని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు అనుమానంతో వాచ్ మ్యాన్ ను ఆరా తీశారు. అయితే ఆ కవర్ ను చెత్త బుట్టలో వేశానని తెలిపాడు. ఆ చెత్తను జిహెచ్ఎంసి చెత్తసేకరణ కార్మికులు ఆటోలో వేశారు. అక్కడి నుండి డంపింగ్ యార్డుకు తరలించారు. కార్మికులు తెలిపిన సమాచారం మేరకు డంపింగ్ యార్డుకు వెళ్లి అదంతా వెతికారు. కానీ డబ్బు కవర్ మాత్రం దొరకలేదు. మరి ఆ కవర్ ఎక్కడికి మాయం అయినట్టు? ఈ వివరాలు తెలియాలంటే కింద ఉన్న మ్యాటర్ చదవండి.
హైదరాబాద్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన ఇది. రాధాకృష్ణ నగర్లో రాజిరెడ్డి కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. రెండు రోజుల క్రితం ఆయన పదిలక్షల రూపాయల డబ్బును ఒక కవర్లో పెట్టి ఇంట్లో ఒక చోట భద్రంగా ఉంచాడు. ఈ నెల 2 న ఉదయం ఇంట్లో ఆ డబ్బులున్న కవర్ కనిపించలేదు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు రాజిరెడ్డి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విచారణలో భాగంగా ఇంట్లోకి ఎవరెవరు వచ్చారని ఆరా తీశారు. పోలీసులకు కాపలాదారుపై అనుమానం కలిగింది. అతడిని విచారించగా…కవర్లో చెత్త ఉందనుకుని చెత్త బుట్టలో వేసినట్టు తెలిపాడు. ఆ చెత్తబుట్టను పరిశీలించగా అందులోని చెత్తను జిహెచ్ఎంసి చెత్త సేకరించే ఆటో డ్రైవర్ ఆటోలో వేసుకుని వెళ్ళిపోయినట్టు తెలిసింది. దీంతో పోలీసులు ఆ ఆటో డ్రైవర్ ను తీసుకెళ్లి సర్కిల్లోని చెత్తను వేసే కాటేదాన్ లోని డంపింగ్ యార్డుకు వెళ్లారు. అక్కడ చెత్త కుప్ప మొత్తం వెతికారు. అయితే అప్పటికే అక్కడి చెత్తను జవహర్ నగర్ లోని డంపింగ్ యార్డుకు తరలించినట్టు అక్కడి కార్మికులు తెలియజేసారు.
దీంతో పోలీసులు హుటాహుటిన జవహర్ నగర్ వెళ్లారు. అక్కడ కూడా కవర్ కోసం చాలా వెతికారు. అక్కడ కూడా ఆ కవర్ దొరకలేదు. ఇక పోలీసులు మల్లి మొదటి నుండి విచారణ ప్రారంభించారు. అసలు చెత్తబుట్టలో డబ్బు కవరే లేదని నిర్ధారణకు వాచినట్టు తెలుస్తోంది. ఇదంతా వాచ్ మ్యాన్ ఆడుతున్న నాటకమని పోలీసులు భావిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. కాగా ఈ కేసు విచారణలో ఉందని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని రాజేంద్ర నగర్ సీఐ సురేష్ తెలిపారు.