ఏపీలో ప్రజా ప్రతినిధుల వాహనాలకు జోరెక్కువ అయింది. వారి బళ్ళు కనిపిస్తేనే చాలు జనం భయంతో వణికిపోతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల కాన్వాయిలు తమని దాటిపోతే చాలు అనుకుంటున్నారు. ప్రజా ప్రతినిధుల వాహనాలు అమాయకుల ప్రాణాలు తీసుకుంటున్నాయి. వారం రోజుల్లోనే ఎమ్మెల్యేల కార్లు ఢీకొని ముగ్గురు చనిపోయారు.
వేగంకన్నా ప్రాణం మిన్న బోర్డులు చాలా చోట్ల కనిపిస్తాయి. కానీ హై ఎండ్ కార్లు వాడే ప్రజా ప్రతినిధులు కూడా అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో ప్రజా ప్రతినిధుల కార్లు ఢీ కొని ముగ్గురు మరణించిన ఘటనలు ఏపీలో చర్చనీయాంశాలుగా మారాయి. బీజేపీ ఎంపీ జీవీఎల్ కారు ఢీ కొని మంగళగిరి హైవేపై ఒక మహిళా మృతి చెందగా, మరో మహిళ తీవ్ర గాయాలపాలయ్యింది. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు వాహనం గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న భార్యాభర్తల్ని ఢీ కొట్టడంతో వారు తీవ్ర గాయాలపాలయ్యారు. హాస్పిటల్ కి తరలిస్తుండగా మహిళ చనిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె భర్త కూడా చనిపోయాడు.
ఇప్పుడు గూడవల్లి సమీపంలో రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యరావు కారు ఒక వ్యక్తిని ఢీ కొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం చెబుతోంది. అది నిజమైతే ప్రజా ప్రతినిధుల్ని ఎందుకు కట్టడి చేయట్లేదనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కఠిన చర్యలు సామాన్యులకేనా? ప్రజా ప్రతినిధులకు కాదా అంటూ సర్వత్రా వినిపిస్తున్న మాటలు.