స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, వైసీపీకి షాకిచ్చి విజయాన్ని సాధించాలని బీజేపీ ఉవ్విళ్లూతోంది. ఎన్నికల వాయిదాను వినియోగించుకుని అధికార వైకాపాతో పాటు, ప్రతిపక్ష టీడీపీకి కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తాజాగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది.
స్థానిక ఎన్నికలు సక్రమంగా జరిగితే వైసీపీ, టీడీపీలకు
బీజేపీ, జనసేన పార్టీలు గట్టి పోటీ ఇస్తాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన లేఖలో జీవీఎల్ సంతకం పెట్టడడం.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. ఎన్నికల వాయిదా వెనుక బీజేపీ హస్తముందన్న వార్తలకు బలం చేకూరుతోంది. ఈ ఎన్నికల ద్వారానే భవిష్యత్తులో తమ పొత్తు ఎలాంటి విజయాలు సొంతం చేసుకోబోతుందనే దానిపై వైకాపా, టీడీపీకి ఓ ట్రైలర్ చూపించాలని కూడా ప్లానింగ్ సిద్ధమయినట్లు కనిపిస్తోంది.
స్థానిక ఎన్నికల వాయిదా అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై స్పందించిన జీవీఎల్ టీడీపీ, వైసీపీపై ప్రజలకు నమ్మకం పోయిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందని చెబుతూనే.. ప్రక్రియను మళ్లీ మొదటి నుండి చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఏదీ ఏమైనా స్థానిక ఎన్నికలను అధికార పార్టీ సహా, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్న దానికి ఈ ఎన్నికలే కొలమానంగా పెట్టుకుని మరీ కష్టపడుతున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. మరి స్థానిక పోరులో ఏ పార్టీ నిలబడుతుందో.. ఎవరి ఆశలు నిజమవుతాయో చూడాలి.