మిర్యాలగూడ అమృత ఇంట్లోకి అర్ధరాత్రి ఆగంతకుడు

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో హత్యకు గురైన ప్రణయ్ ఇంట్లో ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. వారి సిసి టివి ఫుటేజిలు పరిశీలించగా శనివారం తెల్లవారు జామున ఓ వ్యక్తి వారి ఇంటి ముందు కలియ తిరిగాడు. గోడ ఎక్కి బాల్కానీలోకి వచ్చినట్టు గుర్తించారు. ఆగంతకుడు ముఖానికి ముసుగు ధరించి ఉన్నాడు. అప్పుడే అటుగా వచ్చిన పోలీసులను చూసి ఆగంతకుడు పారిపోయాడు. దీనికి సంబంధించి ప్రణయ్ తండ్రి బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇటీవలే ప్రణయ్ హత్య కేసు నిందితులు మారుతీరావు, ఎంఏ కరీం, శ్రావణ్ కుమార్ లపై పిడి యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కూతురు ప్రేమ వివాహం చేసుకుందని అమృత తండ్రి మారుతీరావు అల్లుడు ప్రణయ్ ని కిరాయి హంతకులతో హత్య చేయించాడు. ఈ హత్యోందంతం పెను సంచలనమే సృష్టించింది.

ప్రణయ్ మరణం తర్వాత అమృత ప్రణయ్ ఇంట్లోనే ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భిణి. ప్రణయ్ మరణం తర్వాత ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అమృత ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసు భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అమృతకు అనేక ప్రజాసంఘాలు, పార్టీలు అండగా నిలిచాయి. ప్రణయ్ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని అమృత డిమాండ్ చేసింది. ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేయాలని అమృత డిమాండ్ చేయగా కొందరి నుంచి విమర్శలు కూడా వచ్చాయి.

అమృత జస్టిస్ ఫర్ ప్రణయ్ అనే పేరుతో ఫేస్ బుక్ పేజి ప్రారంభించి ప్రణయ్ కి న్యాయం చేయాలని పోరాడుతోంది. ప్రణయ్ విగ్రహ ఏర్పాటు పై ఈ మధ్య కాలంలో ఓ వింత సంఘటన జరిగింది. పఠాన్ చెరువుకు చెందిన ఓ జంట ప్రణయ్ ఆత్మ తమకు కనిపిస్తుందని, ప్రణయ్ విగ్రహం పెట్టొద్దని చెప్పారు. కావాలంటే మీతో కూడా ప్రణయ్ ఆత్మను మాట్లాడిస్తామని నమ్మించారు. ప్రణయ్ విగ్రహం పెడితే అతని ఆత్మ అందులో బంధి అవుతుందని చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన అమృత పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే ప్రణయ్ ఇంటివద్ద పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.

ఇప్పుడు ఆగంతకుడు వారి ఇంటికి రావడంతో అమృత ప్రాణాలతో పాటు కుటంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. అమృత గర్బవతి కావడంతో కడుపులో ఉన్న బిడ్డకు హని తలపెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ విధమైన పనులు చేస్తున్నారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రణయ్ మరణం తర్వాత అమృత తన తండ్రి ఇంటికి వెళ్లకుండా ప్రణయ్ ఇంట్లోనే ఉంటోంది. పుట్టే బిడ్డ ఎవరైనా సరే అందులో ప్రణయ్ ని చూసుకోని బతుకుతానని చెప్పింది. ప్రేమికుల పై జరిగే హత్యలపై పోరాడుతానని అమృత తెలిపింది.

అమృత ప్రాణాలకు ముప్పు ఉందనే సమాచారంతో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్లో అమృత నివాసం ఉంటున్న ఇంట్లోకి అర్ధరాత్రి ముసుగు ధరించిన వ్యక్తి ఇంట్లోకి చొరబడడం అనేక అనుమానాలకు తావిస్తోంది.