వివాహా వేదికపై మద్యం మత్తులో తూలుతున్న వరుడిని చూసి ఆ పెళ్లిని తిరస్కరించింది వధువు. మొత్తానికి కట్నం కింద ఇచ్చిన డబ్బులను కూడా వరుడి కుటుంబం నుంచి పెళ్లి కుమార్తె తరపు వాళ్లు వసూలు చేశారు. ఈ సంఘటన బీహార్‌లోని దుమ్రి చపియా గ్రామంలో శనివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. బబ్లూ అనే యువకుడితో రింకీ కుమారికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిశ్చయించుకున్నాయి.
ఈ క్రమంలో శనివారం భాజాభజంత్రిల మధ్య పెళ్లి కుమారుడిని వివాహా మండపం వద్దకు తీసుకొచ్చారు. కానీ వరుడు మాత్రం మద్యం మత్తులో తూలుతున్నాయి. సంప్రదాయం ప్రకారం జరిగే కార్యక్రమాలకు కూడా బబ్లూ సహకరించలేదు. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో పెళ్లి కుమార్తెకు కోపం వచ్చి తనకు ఈ పెళ్లి వద్దని తల్లిదండ్రులకు చెప్పేసింది. ఇరు కుటుంబాల పెద్దలు ఎంత చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. మొత్తానికి పెళ్లిని తిరస్కరించింది. ఇక పెళ్లి కుమారుడికి ఇచ్చిన కట్నాన్ని వసూలు చేశారు రింకీ బంధువులు.
బీహార్ రాష్ట్రంలో 2016 నుంచి మద్యంపై నిషేధం విధించారు. అయినప్పటికీ అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో కూడా ఇలాంటి ఘటనే నలంద జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి కుమారుడు, అతని స్నేహితులు మద్యం తాగి వేదికపైకి రావడంతో అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం వరుడితో సహా స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.