కాపురంలో చిచ్చురేపిన వాట్పాప్ చాటింగ్, భర్త ఆత్మహత్య

సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే నష్టాలు కూడా జరుగుతున్నాయి. ఓ వ్యక్తి నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్ వారి కాపురంలో చిచ్చురేపింది. ఇదేంటని భర్త నిలదీస్తే భార్య కుమారుడిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. 13నెలల బాలుడు అనాథ అయ్యాడు.

కడప జిల్లా పులివెందులకు చెందిన ఎర్రగొండ చరణ్ తేజరెడ్డి మూడు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చాడు. కుత్బుల్లాపూర్ లోని వాజ్ పేయి నగర్ లో నర్సరీలో పనిచేసేవాడు. నర్సరీకి వచ్చిపోయే పావని అనే యువతితో చరణ్ కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరు వాజ్ పేయి నగర్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. వీరికి ధనుష్ రెడ్డి అనే 13 నెలల బాలుడు ఉన్నాడు. అయితే వీరిద్దరు పెళ్లి చేసుకున్నట్ట ఆధారాలు లేకపోవడంతో పోలీసులు వీరు సహజీవనం చేస్తున్నారని భావిస్తున్నారు. 

ప్రస్తుతం చరణ్ నర్సరీలో పనితో పాటు ఆటోడ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పావని బాబును చూసుకుంటూ ఇంటి వద్దే ఉంటోంది. ఇటివల పావని ప్రవర్తనలో తేడా రావడంతో చరణ్ పలుసార్లు ప్రశ్నించినా ఆమె వినలేదు. వారం రోజుల క్రితం పావని ఫోన్ కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఐ లవ్ యూ అని వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దానిని చరణ్ చూసి ప్రశ్నించగా ఇద్దరికి మధ్య గొడవ జరిగింది. దీంతో నాలుగు రోజుల క్రితం పావని బాబును ఇంట్లోనే విడిచిపెట్టి ఎటో వెళ్లిపోయింది. మూడు రోజుల నుంచి బాబును చరణే చూసుకుంటున్నాడు. పావని తీరుతో అవమానంగా ఫీల్ అయిన చరణ్ గురువారం రాత్రి ఉరేసుకొని చనిపోయాడు. శుక్రవారం ఉదయం బాబు ఏడుపులు వినపడడంతో పక్కవారు వెళ్లి చూడడంతో చరణ్ చనిపోయి ఉన్నాడు.   

మరణ విషయం చెబితే ఎగతాళిగా మాట్లాడిన పావని 

చరణ్ స్నేహితులు పావనికి ఫోన్ చేసి చనిపోయిన విషయం చెబితే ఎగతాళి అవునా… నిజమా ఫోటోలు పంపండి అంటూ ఎగతాళిగా పావని మాట్లాడిందని వారు తెలిపారు. చరణ్ స్నేహితులు ఫోటోలు తీసి పావనికి పంపిన కూడా ఆమె నుంచి స్పందన రాలేదు. ఆ వస్తానులే అంటూ మాట్లాడిందని వారు చెప్పారు. పావనిది విజయవాడ కాగా చరణ్ ది కడప జిల్లా. పేట్ బషీరాబాద్ పోలీసులు అక్కడకు చేరుకొని చరణ్ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

పావని గత కొద్ది రోజులుగా మరో వ్యక్తితో చనువుగా ఉంటున్నట్టు తెలుస్తోంది. పావని అతనితో కలిసి బయట కూడా తిరిగినట్టు చరణ్ కు తెలిసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి చెప్పినట్టు వింటాడని, చరణ్ అమాయత్వంతో పావని ఆటాడుకుందని చరణ్ స్నేహితులు అన్నారు. చరణ్ చావుకు కారణమైన పావనిని అరెస్టు చేసి శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.