భర్త తాగొచ్చి నిత్యం వేధిస్తున్నాడనే కోపంతో ఓ ఇల్లాలు అతి కిరాతకంగా భర్తను హతమార్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.
మహబూబాబాద్ జిల్లా వస్రాం తండాకు చెందిన గుగులోతు సరితకు లాలితండాకు చెందిన సురేష్ తో 15 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. సురేష్ నిత్యం తాగొచ్చి సరితను కొట్టడంతో పాటు ఆమె దగ్గర ఉన్న డబ్బులు గుంజుకోవడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. పెద్దల సమక్షంలో పంచాయతీలు పెట్టినా సురేష్ తీరులో మార్పు రాలేదు. దీంతో అతనిని హతమార్చాలని సరిత నిర్ణయించుకుంది.
తన దగ్గరి బంధువులైన సుమన్, గణేష్ లతో కలిసి హత్యకు పథకం రచించింది. ఈ నెల 8న సాయంత్రం మాట్లాడాలని చెప్పి ముగ్గురు కలిసి సురేష్ ను వస్రాం తండాకు తీసుకెళ్లారు. రాత్రి పూట అతనికి ఫుల్ గా మందు తాపించారు. మత్తులో ఉన్న సురేష్ ను తాళ్లతో కట్టేశారు. అతనికి షాక్ పెట్టారు. ఇన్నాళ్లు తాను అనుభవించిన బాధ చూడు అంటూ సరిత సురేష్ కు షాక్ పెట్టింది.
ప్రమాదాన్ని గమనించిన సురేష్ పారిపోయే ప్రయత్నం చేశాడు. సురేష్ ను పట్టుకొని రాయితో తలపై కొట్టారు. రాయి దెబ్బకు సురేష్ చనిపోయాడు. అనంతరం సురేష్ మృతదేహాన్ని తండా శివారులోని పాశంబోడు గుట్టపైకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చారు. సురేష్ ఎక్కడ దెయ్యమై వేధిస్తాడోనన్న భయంతో మంత్రగాని సలహా మేరకు దహానానికి ముందు మృతుడి కళ్లలో గుండు సూదుల, పిన్నీసులు గుచ్చారు. గిరిజనుల సాంప్రదాయం ప్రకారం దహనం చేసిన ప్రాంతం చుట్టూ నువ్వులు చల్లారు.
హత్యకు గురైన సురేష్
గొర్రెల కాపరులు పాశంబోడు గుట్టపైకి గొర్రెల మేపేందుకు వెళ్లారు. కాలిన మనిషిని గుర్తించిన గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. లాలితండాకు చెందిన సురేష్ అదృశ్యమైనట్టుగా తెలుసుకున్న పోలీసులు భార్య సరితను విచారించారు. తానే హత్య చేసినట్టు పోలీసుల విచారణలో సరిత అంగీకరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.