ఇంటర్ నుంచే వారిద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమలో ఉన్నా ఏనాడు చదువును నిర్లక్ష్యం చేయలేదు. చదువుకొని ఆమె బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకుంది. అబ్బాయి కూడా ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. కానీ అమ్మాయి కుటుంబ సభ్యులు ఆమెకి మరో అబ్బాయితో నిశ్చితార్దం జరిపించారు. విషయం తెలుసుకున్న అబ్బాయి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అబ్బాయి చనిపోయిన విషయం తెలుసుకొని అమ్మాయి కాల్వలో దూకి చనిపోయింది. విషాదంగా ముగిసిన ప్రేమ జంట కథ తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
వనపర్తి జిల్లా ఖిల్లా గణపురానికి చెందిన చెన్నకేశవులు, రాధిక ఇద్దరిది ఒకే ప్రాంతం. ఇద్దరూ కూడా కమాలొద్దీన్ పూర్ జూనియర్ కళాశాలలో చదువుతున్నప్పుడే ప్రేమలో పడ్డారు. గత ఐదేళ్లుగా వారు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కూడా ఐదేళ్లుగా ప్రేమించుకుంటూ అన్యోన్యంగా ఉండే వారని చెన్నకేశవులు ఫ్రెండ్స్ తెలిపారు. రాధికకు బ్యాంకు లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ రీత్యా రాధిక దేవరకద్రలో ఉండేది.
చెన్నకేశవులు అప్పుడప్పుడు దేవరకద్రకు వచ్చి రాధికను కలిసి వెళ్లేవాడు. ఈ విషయం ఇరువురి ఇళ్లలో కూడా తెలియదు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి నిశ్చితార్దం చేశారు. విషయం తెలుసుకున్న అమ్మాయికి ఫోన్ చేసి అడిగాడు. పెళ్లి వరకు వెళ్లదు బాధపడవద్దు అని అతనికి దైర్యం చెప్పింది.
సోమవారం ఉదయం రాధికకు చెన్నకేశవులు ఫోన్ చేసి గంటన్నరకు పైగా మాట్లాడాడు. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నకేశవులు మరణ వార్త తెలుసుకున్న రాధిక బ్యాంకుకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. కోయిలసాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వ తూము వద్ద బ్యాగును ఉంచి, నీళ్లలోకి దూకింది. ప్రాజెక్టు సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఏఎస్సై ఖలీల్ ఆధ్వర్యంలో పోలీసులు వెళ్లి పరిశీలించారు. ఆమె ఆచూకీ కనిపించలేదు. ఆమె కోసం పోలీసులు, గజ ఈతగాళ్లతో కలిసి గాలిస్తున్నారు. ప్రేమికుల ఆత్మహత్యతో విషాదం నెలకొంది.