లైసెన్స్ గన్ తో కాల్చుకొని లాయర్ ఆత్మహత్య.. కారణం అదేనా?

ప్రస్తుత కాలంలో చిన్న చిన్న సమస్యలకు కూడా చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఒక లాయర్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్ లింగంపల్లిలో చోటుచేసుకుంది. బాగ్ లింగంపల్లిలో ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న 44 సంవత్సరాల వయసు గల శివారెడ్డి అనే వ్యక్తి తనతో ఉన్న లైసెన్స్డ్ గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాల్లోకెళితే… శివారెడ్డి కడప జిల్లాకు చెందినవాడు. ఈయన ఎయిర్ ఫోర్స్ లో సార్జెంట్ గా పని చేసి రిటైర్ అయ్యారు. తర్వాత హైదరాబాద్ చేరుకొని న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. కొంతకాలం క్రితం భార్య నుండి విడాకులు తీసుకొని గత కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం కడప నుండి హైదరాబాద్ చేరుకున్న శివారెడ్డి అపార్ట్మెంట్ దగ్గరలో టీ తాగి తన అపార్ట్మెంట్ లోపలికి వెళ్లి తలుపులు మూసుకున్నారు.

శివారెడ్డి సోదరి మహేశ్వరి అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయలేదు. కవాడిగూడలో ఉంటున్న తన స్నేహితురాలు లక్ష్మీ భవానికి ఫోన్ చేసి తన సోదరుడు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని, అతను ఉంటున్న అపార్ట్మెంట్ లోకి వెళ్లి ఒకసారి చూసి కాల్ చేయమని చెప్పింది. లక్ష్మీ భవాని తన తల్లితో కలిసి అపార్ట్మెంట్ కి వచ్చి చూడగా తలుపు లోపల వైపు నుండి గడియ పెట్టి ఉంది. తలుపు ఎంత తట్టిన తీయకపోవడంతో, వాచ్ మెన్ సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా శివారెడ్డి విగత జీవిగా పడి ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. భార్యతో విడాకులు తీసుకోవడం,ఒంటరిగా జీవించడం ఆర్థిక ఇబ్బందులు ఆత్మహత్యకు కారణం కావచ్చు అని ప్రాథమిక అంచనా వేస్తున్నారు.