తెలంగాణలో మరో బస్సు ప్రమాదం 20 మందికి పైగా గాయాలు

తెలంగాణలో బస్సు ప్రమాదాల పరంపర కొనసాగుతున్నది. మొన్నటికి మొన్న కొండగట్టు అంజన్న దేవాలయం సమీపంలో బస్సు లోయలో పడి 60 మందికి పైగా మరణించారు. ఆ ఘటన మరవకముందే మరో సంఘటన తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

బిజినేపల్లి మండలం, వట్టెం సమీపంలో బస్సు ప్రమాదంలో గాయపడ్డ యువకులు

ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు. అత్యంత విషాదకరమైన విషయమేమంటే ఈ ప్రమాదంలో గాయపడ్డవారంతా విఆర్ఓ, విఆర్ఎ పరీక్ష రాసేందుకు వెళ్తున్న అభ్యర్థులే. తీవ్రంగా గాయపడిన వారిలో ఐదుగురిని హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. స్వల్పంగా గాయపడిన వారందరికీ స్థానికంగానే వైద్యం అందిస్తున్నారు. 

గాయపడ్డవారంతా విఆర్ఓ, విఆర్ఎ అభ్యర్థులే

ఆదివారం తెలంగాణ అంతటా విఆర్ఓ, విఆర్ఎ పరీక్షలు ఉన్నాయి. దీంతో నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి మండలంలోని వట్టెం సమీపంలో ఆర్టీసి బస్సు టైర్ పేలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 80 మంది ప్రయాణిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ బస్సు యాదగిరి గుట్ట డిపోకు చెందినది. 

టైర్ పేలడంతో బోల్తా పడిన బస్సు ఇదే

పరీక్ష సమయం దగ్గరపడడం.. తర్వాత బస్సులు ఉంటాయో లేవో తెలియక అభ్యర్థులు బస్సు టాప్ మీద కూడా కూర్చొని పరీక్ష రాసేందుకు వెళ్తున్నారు. యాదగిరి గుట్ట డిపోకు చెందిన బస్సు వనపర్తి వెళ్లుతున్నది. మార్గమధ్యలో జడ్చర్ల మీదుగా ఈ బస్సు వనపర్తి చేరాలి. అయితే జడ్చర్ల నుంచి వనపర్తిలో పరీక్ష రాసేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో బస్సు ఎక్కారు. టాప్ పైన కూడా కూర్చున్నారు. దీంతో ఓవర్ లోడ్ కారణంగా బస్సు టైర్ పేలి బస్సు బోల్తా పడిందిని చెబుతున్నారు. 

ప్రమాదానికి గురైన బస్సు యాదగిరి గుట్ట డిపో కు చెందినది.

కొండగట్టు ప్రమాదం జరిగిన వారం లోపే తెలంగాణలో మరో బస్సు ప్రమాద ఘటన జరగడవం విషాదం నింపింది. ఇదిలా ఉంటే కొండగట్టు బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీసి అధికారులు నిద్ర లేచారు. జగిత్యాల జిల్లాలో ఓవర్ లోడ్ తో వెళ్తున్న బస్సులను రైడ్ చేసి సీచ్ చేశారు.