కవిత vs జీవన్ రెడ్డి.. ఇక మండలిలో మంటలే

విధి చాలా బలీయమైనది. వద్దనుకున్న వాళ్లు కలుస్తారు. కలవాలనుకున్న వాళ్లు విడిపోతారు. వినేందుకు ఇది వేదాంతంలా ఉన్నా … ఒక్కోసారి చోటుచేసుకునే పరిణామాలను చూస్తే ఇదే నిజమని అనిపిస్తుంది. కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి విషయంలో ఇదే జరిగింది. ఇద్దరూ రాజకీయాల్లో ఆరితేరిన నేతలే. ప్రజల్లో నిత్యం ఉంటూ మాస్ ఇమేజ్ సంపాదించుకున్న వాళ్లే. కాక పోతే నిజామాబాద్ జిల్లా మొత్తం గులాబీ జెండా రెప రెపలాడడంతో కల్వకుంట్ల మిగతా ప్రాంతాలపై దృష్టి పెట్టారు.

ముఖ్యంగా తన లోకసభ నియోజకవర్గంలోకి వచ్చే జగిత్యాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందుకోసం అప్పటికే ప్రజానాయకుడిగా ఖ్యాతి గడించి బలమైన నేతగా ఎదిగిన జీవన్ రెడ్డితో తలపడాల్సి వచ్చింది. దీనికి తోడు తనకు అత్యంత ఆప్తుడు అయిన సంజయ్ కి టీఆర్ఎస్ టిక్కెట్ దక్కడంతో తన పలుకుబడి ఉపయోగించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తెచ్చిన వందలాది కోట్ల నిధులను జగిత్యాలలో కుమ్మరించింది. ఐదేళ్లలో ఏకంగా ఐదు వందల కోట్లు వెచ్చించి జగిత్యాల పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసింది.

దీంతో అప్పటి వరకు జీవన్ రెడ్డితో ఉన్న జగిత్యాల ప్రజలు కనీ వినీ ఎరుగని అభివృద్ధితో కవిత వైపు మొగ్గు చూపారు. దీనికి తోడు మన ఊరు మన ఎంపీ కార్యక్రమంలో జగిత్యాలలోని అన్ని గ్రామాలను చుట్టేసి బలమైన క్యాడర్ ను తయారు చేశారు కవిత. ఈ పరిణామాలన్ని కలిసొచ్చి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన సంజయ్ చేతిలో జీవన్ రెడ్డి ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఇలా కవిత తన మార్క్ రాజకీయంతో జీవన్ రెడ్డిని ఓడిస్తే… ఆతర్వాత జరిగిన లోకసభ ఎన్నికల్లో జీవన్ రెడ్డి తన సత్తా చాటారు. సరిగ్గా లోకసభ ఎన్నికలకు ముందు పసుపు రైతులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరగబడడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న జీవన్ రెడ్డి రైతులను కవిత పైకి ఉసిగొల్పారు. దీంతో కవిత ఓడిపోవాల్సి వచ్చింది.
గెలుపే లక్ష్యంగా తమ ఎత్తుగడలతో కత్తులు దూసుకున్న ఈ ఇద్దరు నేతలు ఇలా అనూహ్య పరిణామాల మధ్య ఓడిపోవాల్సి వచ్చింది.

అయితే ఆతర్వాత గ్రాడ్యూయేట్ నియోజకవర్గం నుంచి గెల్చి జీవన్ రెడ్డి శాసనమండలిలో అడుగు పెడితే ఇప్పుడు కవిత స్థానిక సంస్థల కోటాలో మండలిలో అడుగుపెట్టబోతున్నారు. అసెంబ్లీలో ఉండాల్సి జీవన్ రెడ్డి మండలికి వస్తే లోకసభలో ఉండాల్సిన కవిత కూడా మండలికి రావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఇరువురు నేతలు ఒకే సభలో ఎదురుపడితే ఎలా ఉంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక వేళ కవిత మంత్రి పదవిని స్వీకరిస్తే మళ్లీ జగిత్యాలలో జోరు పెంచుతారు. ఈ జోరును తట్టుకునేందుకు మండలిలో జీవన్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశం ఉంది. జీవన్ రెడ్డి లేవనెత్తే అంశాలకు మంత్రిగా కవిత కూడా సమాధానం చెప్పాల్సి రావచ్చు. మొత్తం మీద వీళ్లిద్ధరి మధ్య మొదలైన రాజకీయా వైరం ఇలా ఇంట్రస్టింగ్ గా మారిందన్న మాట.