టిడిపి రమణ తెలంగాణ డిప్యూటీ సిఎం

తెలంగాణలో ఎలాగైనా కేసిఆర్ పార్టీని ఖతం చేసే దిశగా మహా కూటమి అడుగులు వేస్తున్నది. కాంగ్రెస్, టిడిపి, తెలంగాణ జన సమితి, సిిపిఐ పార్టీలు కూటమిగా ఏర్పాటయ్యాయి. ప్రజా వ్యతిరేక, కుటుంబ పాలన, నియంత పాలన చేస్తున్న కేసిఆర్ ఫ్యామిలీని దింపడమే మహా కూటమి లక్ష్యంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మహా కూటమి అధికారంలోకి వస్తే ఎవరు ఏ పాత్ర పోశిస్తారన్నదానిపై రకరకాల ఊహాగానాలు వినబడుతున్నాయి.

కూటమి అధికారంలోకి వస్తే కచ్చితంగా టిడిపి తెలంగాణ శాఖ అధ్యక్షులు ఎల్ రమణ ఉపముఖ్యమంత్రి కావడం ఖాయం అని టిడిపి వర్గాల్లో టాక్ నడుస్తోంది. కూటమిలో తమకు ఒక ఉప ముఖ్యమంత్రితోపాటు మరో రెండు మంత్రి పదవులు దక్కవచ్చని టిడిపి నేతలు ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి రమణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఏం కథ అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు రమణ రానున్న ఎన్నికల్లో పోటీ కూడా చేయడని కూడా ఒక వాదన ఉంది. దాని వివరాలేంటో చూద్దాం.

రమణ గత ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి జీవన్ రెడ్డి మీద ఓడిపోయారు. ఆయన ఇప్పటి వరకు జగిత్యాలలోనే పోటీ చేస్తూ ఉన్నారు. కానీ ఈసారి మహా కూటమి కావడంతో రమణ జగిత్యాల సీటును సిట్టింగ్ అయిన జీవన్ రెడ్డికే వదిలేశారు. తాను జగిత్యాలలో పోటీ చేయబోనని ప్రకటించారు. అయితే కోరుట్లలో రమణ పోటీ చేసే చాన్స్ ఉందని చెబుతున్నారు. 

కోరుట్ల ప్రస్తుత సిట్టింగ్ టిఆర్ఎస్ ది. ఇప్పుడున్న టిఆర్ఎస్ సిట్టింగ్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకే టిఆర్ఎస్ మల్లా టికెట్ కేటాయించింది. అయితే ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని టిడిపి అంచనాల్లో ఉంది. అందుకే రమణ ను కోరుట్లలో పోటీకి దించడం ద్వారా అటు జగిత్యాల, ఇటు కోరుట్ల రెండు సీట్లలో కూటమి గెలుపు ఖాయమని టిడిపి భావిస్తోంది. రాజకీయ జీవితంలో మచ్చ లేని నాయకుడిగా చెలామణి అవుతున్నారు రమణ. ఆయన కోరుట్లలో పోటీ చేస్తే కాంగ్రెస్ లోని అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తాయన్న ధీమాతో ఉన్నారు. 

అయితే కోరుట్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు భారీగానే ఉన్నారు. బిసి మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన డాక్టర్ జెఎన్ వెంకట్, కొమిరెడ్డి రాములు, టికెట్ రేస్ లో ఉన్నారు. వారితోపాటు మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు నర్సింగ్ రావు కూడా కాంగ్రెస్ లో ఇటీవల చేరారు. గత మూడేళ్ల క్రితం జువ్వాడి రత్నాకర్ రావు టిఆర్ఎస్ లో చేరారు. అయితే ఆయనకు టికెట్ కేటాయించకపోవడంతో 105 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించగానే టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. మరో పద్మశాలి నేత రుద్ర శ్రీను కూడా పోటీ చేయాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు.

కూటమిలో సీటును కాంగ్రెస్ తీసుకుంటే వీరిలో ఎవరో ఒకరికి సీటు రావొచ్చని అంటున్నారు. అలా కాకుంటే టిడిపికి దక్కితే రమణ పోటీకి దిగడం ఖాయమంటున్నారు. కోరుట్లలో సుమారు 45 వేల పైచిలుకు పద్మశాలీ కులానికి చెందిన ఓట్లు ఉంటాయని వారంతా రమణకు వన్ సైడ్ సపోర్ట్ చేయడం ఖాయమని కూడా కోరుట్లకు చెందిన ఒక టిడిపి పద్మశాలి నేత తెలిపారు. రమణ కూటమి తరుుపన పోటీ చేస్తే కాంగ్రస్ లోని అన్ని సెక్షన్లు కచ్చితంగా సపోర్టు చేస్తాయన్నారు. టిఆర్ఎస్ విద్యాసాగర్ రావుపై ఉన్న వ్యతిరేకత కూడా తమకు కలిసొస్తుందంటున్నారు. 

రమణ కోరుట్లలో చేయలేని పరిస్థితి వస్తే మరే స్థానంలో పోటీ చేస్తారన్న విషయంలో కూడా ఒక చర్చ గతంలో జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లోని ఏదో ఒక నియోజకవర్గంలో రమణ పోటీ చేయవచ్చని కూడా ఒక లీక్ వచ్చింది. కొన్ని నియోజకవర్గాలను కూడా పరిశీలించారు. అయితే ఇప్పుడు ఆ ప్రతిపాదన ఏదీ తమ వద్ద చర్చలో లేదని, రమణ పోటీ అంటూ చేస్తే కోరుట్లలోనే అని రమణ కు అత్యంత సన్నిహితుడు ఒకరు తెలిపారు. ఒకవేళ పోటీ చేయలేని పరిస్థితి వచ్చినా కూటమి అధికారంలోకి వస్తే రమణ కచ్చితంగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు. 

కోరుట్లలో పోటీ చేయలేని పరిస్థితి వచ్చినా, రమణ ఎమ్మెల్సీగా ఎన్నికై ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉందని టిడిపి వర్గాల్లో టాక్ నడుస్తోది. ఇప్పటి వరకు కేసిఆర్ కేబినెట్ లో ఉన్న ఇద్దరు ఉపముఖ్యమంత్రులు కూడా ఎమ్మెల్సీలే కదా అంటున్నారు. కడియం శ్రీహరి, మహమూద్ అలీ ఇద్దరూ ఎమ్మెల్సీలే. గతంలో స్టేషన్ గన్ పూర్ నుంచి గెలిచిన తాటికొండ రాజయ్య తొలుత ఉపముఖ్యమంత్రి అయ్యారు. కారణాలు ఏంటో తెలియదు కానీ ఆయనను అవమానకరంగా బర్తరఫ్ చేశారు. 

ఇక తెలంగాణ లో కేసిఆర్ ప్రభుత్వంలో బిసిలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని టిడిపి అంటున్నది. మంత్రి వర్గంలో బిసిలకు సముచిత స్థానం లేదని, కేబినెట్ నిండా కేసిఆర్ కుటుంబసభ్యులు, రెడ్లే ఉన్నారని టిడిపి నేతలు అంటున్నారు. కానీ కూటమి అధికారంలోకి వస్తే బిసిలకు మరిన్ని పోస్టులు రాబట్టేందుకు తమ పార్టీ ప్రయత్నం చేస్తుందంటున్నారు.