ట్రాఫిక్ పోలీస్ బాస్‌కే షాకిచ్చిన సిబ్బంది

హైదరాబాద్ నగర ట్రాఫిక్ చీఫ్ గా వ్యవహరించే అదనపు పోలీస్ కమీషనర్ అనిల్ కుమార్ వాహనం నో పార్కింగ్ ప్లేసులో పెట్టడంతో ఓ నెటిజన్ ఫోటో తీసి ట్విట్టర్ లో పెట్టాడు. దీంతో పోలీసులు ఆ వాహనానికి 235 రూపాయల చలానా విధించారు. పూర్తి వివరాలు ఏంటంటే…

గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు అనిల్ కుమార్ తో పాటు డిసిపి ఎల్ఎస్ చౌహన్ వచ్చారు. వారు వాహనం దిగి స్టేషన్ లోపలకు వెళ్లారు. అయితే వీరి వాహనాలను సక్రమైన ప్లేసులో పెట్టాల్సిన బాధ్యత వారి డ్రైవర్ల పై ఉంటుంది. డ్రైవర్ రోడ్డు పక్కకు బండిని ఆపారు. దాని పక్కనే పోలీసులు ఏర్పాటు చేసిన నో పార్కింగ్ బోర్టు ఉంది.

దీనిని గమనించిన ఓ నెటిజన్ ఫోటో కొట్టి ట్రాఫిక్ చీఫ్ కమిషనర్ ట్విట్టర్ కు పంపారు. వారు వెంటనే రూ. 235 చలానా విధిస్తు రశీదు జారీ చేశారు. విషయం తెలుసుకున్న అనిల్ కుమార్ ముందుగా డ్రైవర్ తో ఆ చలాను కట్టించారు. ఆ తర్వాత తన జేబులో నుంచి తీసి డ్రైవర్ కు పైసలిచ్చారు. ట్రాఫిక్ చీఫ్ కే జరిమానా విధించడంతో శభాష్ పోలీస్ అంటూ పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.