వాట్సాప్‌లో ఆకతాయి..  హైదరాబాద్ అమ్మాయి ఏం చేసిందంటే

ఐ లవ్ యూ…నీవు చాలా అందంగా ఉంటావు…నిన్ను పెండ్లి చేసుకుంటా…నా ప్రేమను అంగీకరించు…ఈ విధంగా 15 రోజులుగా ఓ యువతికి వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయి. అసలు ఈ మెసేజ్‌లు పంపిస్తున్న వ్యక్తి ఎవరో కూడా ఆమెకు తెలియదు. ఈ మెసేజ్‌లకు అధైర్య పడకుండా ఆ యువతి ధైర్యంగా ఓ అడుగు ముందుకు వేసింది. నిన్ను చూడంది నేను ఎలా ప్రేమించాలి..నీవు ఎవరో తెలియంది నిన్ను ఎలా పెండ్లి చేసుకోవాలి..నిన్ను ప్రేమించాలంటే..నేను నిన్ను కలవాలంటూ రప్పించి పోలీసులకు పట్టించింది. ఆ యువతి చేసిన ధైర్యంకు ఇప్పుడు అందరూ హ్యాట్సాప్ అంటూ ప్రశంసిస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ మీర్‌పేట్ పరిధికి చెందిన ఓ యువతి( 22) ఇంజినీరింగ్ చదువుతుంది. 15 రోజులుగా ఆమె వాట్సాప్‌కు రోజూ దాదాపు 50 మెసేజ్‌ల వరకు వస్తున్నాయి. నిన్ను ప్రేమిస్తున్నాను… పెండ్లి చేసుకుంటానని మెసేజ్‌లు, ఆమెకు సంబంధించిన ఫొటోలను పంపిస్తున్నాడు. ఈ మెసేజ్‌లతో కలవరానికి గురికాకుండా యువతి మొదట విషయాన్ని ఇంట్లో వారికి చెప్పింది. ఆ తర్వాత మెసేజ్‌లను పంపిస్తున్న గుర్తు తెలియని వ్యక్తితో చాటింగ్ చేసింది.

 ఆ చాటింగ్‌లో అతని గురించి ఆరా తీసేందుకు ప్రయత్నిస్తే అతను తాను మీ ఫ్రెండ్ వాళ్ల అక్క పెండ్లిలో నిన్ను చూశాను. అప్పటి నుంచి నీపై ప్రేమ కలిగిందని జవాబు ఇస్తున్నాడు. ఇలా అతని ఆచూకీ గురించి ఆరా తీయడానికి ప్రయత్నించి విఫలమైంది. అయితే నిన్ను ప్రేమించాలంటే నేను మొదట నిన్ను కలువాలి. లేదంటే ప్రేమ ఎలా సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. దీంతో ఆ యువకుడు కలువడానికి ఒకే అన్నాడు. కుటుంబ సభ్యులతో ముందస్తుగా ఓ ప్రణాళికను సిద్ధం చేసుకుని యువతి శనివారం అతన్ని నగరానికి రప్పించింది.

ముందుగా అతనిని ఓ బేకరికి రమ్మని చెప్పి అక్కడ కలిసి కాసేపు అతనితో సరదాగా మాట్లాడినట్టు చేసింది. ఈ లోపు యువతి కుటుంబసభ్యులు యువకుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మీర్ పేట్ పోలీసులకు అప్పగించారు. అక్కడి పోలీసులు ఈ కేసును రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు అప్పగించారు.

దర్యాప్తులో యువకుడు మెసేజ్‌లు పంపిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. విచారణలో అతనిని నల్గొండ జిల్లా ప్రాంతానికి చెంది న నాగరాజుగా గుర్తించారు. డిగ్రీ వరకు చదివి ఫొటో గ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఈ విధంగా వేధింపులకు పాల్పడ్డ యువకుడిని పట్టించిన యువతి ధైర్యానికి పోలీసులు కూడా శభాష్‌లతో అభినందించారు. అదే విధంగా తన కుమారుడు అమ్మాయిలను ఏడిపిస్తున్నట్లు తెలుసుకున్న యువకుడి తండ్రి చేసిన తప్పుకు చట్టపరంగా శిక్ష పడాల్సిందేనని చెప్పడం గమనార్హం.

ఈ విధంగా యువతులు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లు, ఫొటోలతో బెంబేలెత్తకుండా కుటుంబ సభ్యుల సహాయం తీసుకుని పోలీసులను ఆశ్రయిస్తే భయాందోళనలు, కలవరం వారి చెంతకు చేరదని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.