కర్కశ తల్లిదండ్రులు, పసిబిడ్డపై దారుణం

ఎన్ని ఇబ్బందులు ఉన్నా నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. ఆ బిడ్డకు చిన్న దెబ్బ తాకినా తట్టుకోలేదు. అమ్మకి అన్ని అవయవాలు సరిగా ఉన్న బిడ్డకంటే అవిటి బిడ్డ మీదే ప్రేమ ఎక్కువ అని వింటూ ఉంటాం, చూసే ఉంటాం. అటువంటి అమ్మలకు మచ్చ తెచ్చేలా విజయవాడలో ఒక ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఒక పసి బిడ్డను విజయవాడ అమెరికా హాస్పిటల్ గేటు ముందు వదిలేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు.

అక్కడివారు పోలీసులకు సమాచారం అందించడంతో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా ఎవరో వ్యక్తులు కార్ నుండి దిగి ఆ పసిబిడ్డని గేటు ముందు వదిలి వెళ్లిపోయారు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా కార్ నంబర్ గుర్తించారు. కార్ నంబర్ ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు బిడ్డని వదిలి వెళ్ళింది తల్లిదండ్రులేనని తెలుసుకున్నారు. వీరు ఖమ్మం జిల్లా వాస్తవ్యులు అని గుర్తించారు విజయవాడ పోలీసులు. పసిబిడ్డ అనారోగ్యంగా ఉన్న కారణంగానే వారు వదిలేసినట్టు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రానికి పోలీసులు ఆ బిడ్డ తల్లిదండ్రుల్ని విజయవాడకు రప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.

అనారోగ్యం కారణంగా పసిబిడ్డను వదిలేసింది తల్లిదండ్రులే అని తెలిసి హాస్పిటల్ సిబ్బంది, స్థానికులు షాక్ కి గురయ్యారట. ఆ కసాయి తల్లిదండ్రుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు అని పలువురు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అనారోగ్యంగా పుడితే వైద్యం చేయించి బ్రతికించుకోవాలి లేదా ఉన్నన్నాళ్ళు కంటికి రెప్పలా చూసుకోవాలి. అయినా అన్ని వ్యాధులకు మందులుంటున్న ఈ రోజుల్లో అప్పు చేసి అయినా బిడ్డల్ని కాపాడుకోవాలి కానీ ఇలా వదిలేయటం ఏంటి అని కొందరు మహిళలు విచారం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.