హరికృష్ణ సెంటిమెంట్ తప్పింది, అందుకే ఇలా…

నల్గొండ జిల్లా అనపర్తి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ కుమారుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం మృతి చెందారు. దీంతో నందమూరి అభిమానుల్లోనూ, సినీ, రాజకీయ వర్గాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. కారు అతి వేగం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం ఆయన ప్రాణాలు కోల్పోడానికి ప్రధాన కారణాలుగా వినిపిస్తున్న మాటలు.

ఆయన సన్నిహితులు, హరికృష్ణ గురించి బాగా తెలిసిన వారు మాత్రం సెంటిమెంటు తప్పడం కూడా ఆయన మృతికి కారణమైందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలు గురించి టీడీపీ నాయకుడు కంభంపాటి రామ్ మోహన్ రావు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన ఏం చెప్పారో కింద వివరాలు ఉన్నాయి చదవండి.

హరికృష్ణ సెంటిమెంటును బలంగా నమ్మేవారు. ప్రయాణాల్లో సరి సంఖ్య ఉండేలా చూసుకుంటారు, మంగళవారం ముఖ్యమైన పనులు చేయరు. ప్రతి నిత్యం పూజ తప్పనిసరిగా చేస్తారు. కాగా నెల్లూరు పెళ్ళికి వెళ్ళటానికి బయలుదేరిన హరికృష్ణ మొట్టమొదటిసారి తన సెంటిమెంటు తప్పించారని తెలుస్తోంది. బుధవారం ఉదయం నెల్లూరు కావలిలో హరికృష్ణ హాజరు కావాలి అనుకున్న పెళ్లి ముహూర్తం 10 గం.ల 30 ని.లు. అయితే ఆ పెళ్లి ముహూర్తం టైముకి అక్కడికి చేరుకోవాలి అని ఆయన పడిన తపనే కారు వేగాన్ని పెంచేలా చేసినట్లు అనిపిస్తుంది.

ఒక రోజు ముందే బయలుదేరడానికి…ముందు రోజు మంగళవారం కావడంతో ఆయన బుధవారం తెల్లవారుజామున ప్రయాణమయ్యారు. హరికృష్ణ తెల్లవారుఝాము నాలుగు గంటల సమయం దాటిన తర్వాత ఇంటి నుండి తన ఇద్దరు స్నేహితులతో కలిసి బయలుదేరారు. అప్పటికే ఉదయం మూడు గంటలకు లేచి పూజ కార్యక్రమాలు కూడా ముగించుకున్నారట.

కానీ ఇంటి నుండి బయలుదేరేటప్పుడే ఆయన సెంటిమెంట్ తప్పించారట. ఎప్పుడూ సరి సంఖ్య ఉండేలా చూసుకుని ప్రయాణించే హరికృష్ణ ఈసారి ముగ్గురుగా వెళ్లారట. వారితో పాటు మరో స్నేహితుడు కూడా పెళ్ళికి వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన రావడం లేట్ అవడంతో అప్పటికే సమయం 4:30 కావడంతో పెళ్లి ముహూర్తానికి అందుకోలేము అనే ఆదుర్ధాలో హరికృష్ణ తన ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లిపోయారట.

అలా మొట్ట మొదటిసారి బేసి సంఖ్యతో ప్రయాణం చేశారట హరికృష్ణ. ఈ విషయాలు హరికృష్ణ కుటుంబసభ్యుడు రామకృష్ణ(జూనియర్) నాకు వివరించాడు అంటూ రామ్ మోహన్ ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన మొదటిసారి సెంటిమెంటు తప్పించటంతోనే ప్రాణాలు కోల్పోయారు. సెంటిమెంటు కూడా ఆయనను వెంటాడిందంటూ కుమిలిపోతున్నారు కుటంబ సభ్యులు, సన్నిహితులు.