నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారుని(నంబరు AP31 9000) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందారు. అందరూ హరికృష్ణ కోణంలోనే ఆలోచించి హరికృష్ణ కుటుంబానికి తీవ్ర నష్టం జరిగిందని సానుభూతి చూపిస్తున్నారు. అందులో ఎటువంటి పొరపాటు లేదు. కానీ హరికృష్ణ కారు ఢీ కొనడంతో అవతలి కారులోని వ్యక్తులకు ప్రాణ నష్టం జరగకపోయినా వారి జీవనాధారానికి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి సెలబ్రిటీ కావడంతో ఇతర కారులో నష్టపోయిన వ్యక్తులవైపుకి ఎవరూ దృష్టి మల్లించట్లేదు.
ఆ నలుగురు హైదరాబాద్ కు చెందిన ఫొటోగ్రాఫర్లు. హరికృష్ణ కారు వీరి కారును ఢీ కొట్టడంతో వీరిలో ప్రవీణ్, శివ, భార్గవ్ గాయాలపాలయ్యారు. అంతేకాకుండా కారులో ఉన్న వారి కెమెరాలు, ఫొటోగ్రఫీకి సంబంధించిన ఇతర సామాగ్రి కూడా ధ్వంసమయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన తర్వాత హరికృష్ణని నార్కెట్ పల్లికి హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు వీరిని కూడా హాస్పిటల్ కి తరలించి వైద్య సదుపాయం కల్పించారు. కానీ హరికృష్ణ మృతదేహం హాస్పిటల్ లో ఉన్నంత వరకే వీరి గురించి పట్టించుకున్నారు. హాస్పిటల్ నుండి ఎప్పుడైతే హరికృష్ణ మృతదేహాన్ని ఇంటికి తరలించారో ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకున్నవారే లేరంటూ ఆ ఫొటోగ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ ఫొటోగ్రాఫర్లు చెన్నైలో ఒక ప్రోగ్రాం ముగించుకుని హైదరాబాద్ వస్తుండగా హరికృష్ణ కారు అదుపు తప్పి వీరి కారును ఢీ కొట్టింది. దీంతో వీరికి శారీరక పరమైన, ఆర్థికపరమైన నష్టం జరిగింది. హాస్పిటల్ లో చేర్పించడంతో పోలీసులు కూడా తమ చేతులు దులిపేసుకుందని, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవాళ్ళం, వైద్యానికి కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు అంటూ వాపోతున్నారు. మా జీవనాధారమైన వస్తువుల్ని కూడా కోల్పోయాము. రేపటి నుండి మేము ఎలా బ్రతకాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. మాకు న్యాయం చేసేవారు ఎవరూ అంటూ ప్రవీణ్, శివ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.
హరికృష్ణ అంత్యక్రియలను ఘనంగా అధికారిక లాంఛనాలతో నిర్వహించిన ప్రభుత్వం మాకు కూడా సహాయం చేసి మా కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలి అంటూ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు. అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం బాధిత వ్యక్తులకు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తుంది. కానీ ఈ ఘటనలో నష్టపోయిన ఫొటోగ్రాఫర్లను కనీసం పరామర్శించకపోవటం గమనార్హం.