ప్రజల ప్రాణాలు కాపాడవలసిన డాక్టర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రోగులకు చికిత్స చేసే సమయంలో వైద్యులు అరకొర జ్ఞానంతో నిర్లక్ష్యంగా వైద్యం చేయటం వల్ల రోగుల ఆరోగ్యం బాగుపడటం అటు ఉంచితే ఏకంగా వారి ప్రాణాల మీదికి వస్తోంది. ఇటీవల వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఇటువంటి ఘటన చోటుచేసుకుంది. చెయ్యి ఫ్రాక్చరైందని చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
వివరాలలోకి వెళితే…వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగతండాకు చెందిన భూక్యా విహాంత్ అనే ఎనిమిదేళ్ల బాలుడికి ఇటీవల చెయ్యికి దెబ్బ తగలటంతో చెయ్యి ఫ్యాక్చర్ అయ్యింది. ఈ క్రమంలో బాలుడి తల్లిదండ్రులు ఇటీవల ఆపరేషన్ కోసం వరంగల్ ఎంజీఎంలో చేర్పించారు. అయితే చేయి ఫ్రాక్చర్ అయ్యిందని చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన బాలుడు అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతి చెందాడు. దీంతో బాలుడు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలుడికి చికిత్స అందించే సమయంలో అధిక మోతాదులో మత్తుమందు ఇవ్వడం వల్ల తమ కుమారుడు చనిపోయాడని ఆ తల్లితండ్రులు రోధిస్తున్నారు.
తమ కుమారుడి మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి చంద్రశేఖర్ ఈ ఘటన గురించి విచారణకు ఆదేశించారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేయటంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు బాలుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి వారిని శాంతింపచేశారు.
అయితే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మత్తుమందు వైద్య విభాగంలో 25 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధులు నిర్వహించాల్సి ఉండగా వీరు ఒక్కరోజు కూడా విధులకు హాజరు అయిన దాఖలాలు కనిపించడం లేదని అక్కడి స్థానికులు వెల్లడించారు. వారి స్థానంలో కాంట్రాక్టు వైద్యులు పీజీ వైద్యులు మాత్రమే ఆసుపత్రిలో రోగులకు సేవలు అందిస్తున్నారని వారు వెల్లడించారు. వీరికి వైద్యం పట్ల సరైన అవగాహన లేకపోవడంతో బాలుడికి అధిక మోతాదులో అనస్థీషియా ఇవ్వటం వల్లే బాలుడు చనిపోయినట్లు వారు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.