ప్రస్తుత కాలంలో మహిళల పట్ల వేధింపులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. మహిళలకు రక్షణ కల్పించడానికి పోలీసులు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ మహిళల పట్ల వేధింపులు మాత్రం తగ్గటం లేదు. కాలేజీలు, స్కూల్, ఆఫీస్ ఇలా ఎక్కడికి వెళ్లినా కూడా కొంతమంది తమ వికృత చేష్టలతో మహిళలను వేధిస్తున్నారు. అయితే కొంతమంది మహిళలు ధైర్యంగా అలాంటి వారిని ఎదుర్కొంటుంటే మరి కొంతమంది మాత్రం ఆ వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆకతాయిల వేధింపులు భరించలేక కడుపులో బిడ్డ ఉన్న సంగతి కూడా మరచిపోయి ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాలలోకి వెళితే…వరంగల్‌జిల్లా ఖానాపురం మండలం.. బండమీదతండా కు చెందిన రమేష్ అనే వ్యక్తికి మండలానికి చెందిన అనూష అనే యువతితో
గతేడాది వివాహం జరిగింది. వివాహం జరిగిన సమయం నుండి అనూష భర్త అత్తమామలతో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తోంది. అంతేకాకుండా అనూష ఇటీవల గర్భం దాల్చడంతో పుట్టబోయే బిడ్డ గురించి కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉన్నారు. అయితే అదే గ్రామానికి చెందిన ఉస్మాన్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి అనూషని వేధిస్తూ ఉండేవాడు. ఈ విషయం గురించి అనుష కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో గ్రామస్తులు, పోలీసులు ఉస్మాన్ ని మందలించిన కూడా ఫలితం లేకపోయింది.
అయినప్పటికీ ఉస్మాన్ తన స్నేహితులతో కలిసి అనూషని వేధింపులకు గురి చేయటంతో ఆ వేధింపులు భరించలేక అనూష ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కుటుంబ సభ్యులు అనూష నీ గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనూష రెండు రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయింది. అనూష మరణానికి ఉస్మాన్ అతని స్నేహితులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులకు సరైన శిక్ష విధిస్తామని బాధితురాలి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.