దేశంలో కరోనా విజృంభించినప్పటి నుండి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని తమ ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎంతోమంది తమ సొంత గ్రామాలలోనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ వర్క్ ఫ్రం హోం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కట్టుకున్న భార్యతో పాటు అత్త మామలు కూడ వేదించటంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే…హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లి గ్రామానికి చెందిన కొండా రాకేష్ అనే యువకుడు హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 2021 ఫిబ్రవరిలో వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుకుర్తిహవేలికి చెందిన దేవులపల్లి నిహారిక అనే యువతితో రాకేష్ కి వివాహం జరిగింది. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం ఉండటంతో రాకేష్ గ్రామంలోనే తన ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నాడు. వివాహం జరిగిన తర్వాత కొంతకాలం వారి కాపురం సజావుగా సాగిపోయింది. కానీ హైదరాబాద్ కి వెళ్లచ్చని ఎన్నో కలలు కన్న నిహారికకి పల్లెటూరులో ఉండటం ఇష్టం లేదు. అందువల్ల హైదరాబాద్‌కు వెళ్దామని భర్తను తరచూ పోరు పెట్టేది.
వర్క్ ఫ్రం హోం పూర్తికాగానే హైదరాబాద్‌కు వెళ్దామని రాకేష్ ఎంత చెప్పినా కూడా రోజూ ఇదే విషయమై ఇద్దరిమద్య గొడవ జరుగుతూ ఉండేది. ఈ క్రమంలో నిహారిక గర్భం దాల్చడంతో ఐదు నెలల తర్వాత పుట్టింటికి వెళ్ళింది. కొన్ని రోజుల క్రితం నిహారిక తన భర్తకు వీడియో కాల్ చేసి నువ్వు చనిపోతే నేను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీనికి తోడు నిహారిక తల్లి తండ్రి కూడా వేధించటంతో రాకేష్ మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో జీవితం మీద విరక్తి కలిగి సూసైడ్ లెటర్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు రాకేష్ రాసిన సూసైడ్ లెటర్ ఆధారంగా అతడి భార్యతో పాటు అత్తమామలను కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.