హంపిలో ఒక్క విరూపాక్ష స్వామి ఎందుకు ఉన్నట్టు ?

కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయనగర సామ్రాజ్యం రాజధాని హంపీ లో కొలువైన విరూపాక్ష స్వామి గురించి చారిత్రిక సత్యాలు .

విజయ నగర సామ్రాజ్యం ఆవిర్భావం 1336లో జరిగింది . హరిహర రాయలు , బుక్కరాయలు అనే సోదరులు విజయనగర సామ్రాజ్య  స్థాపకులు . వీరు శైవ మతస్తులు . అక్కడ వున్న విరుపాక్షుడు వీరికి ఇష్ట దైవం . వీరు మహారాజులు మాత్రమే కాదు గొప్ప కవులు కూడా .శైవ కవులను ఆదరించారు , సాహిత్యాన్ని ప్రోత్సహించారు . ఆది శంకరాచార్యులవారి  ప్రభావంతో శైవానికి పెద్ద పీఠ వేశారు . వీరి హయాంలో శైవ మతం తో పాటు సాహిత్యం ఉజ్వలంగా వెలిగింది .

శైవ మతాభిమానులు రాజధానిలో శివ లింగాలను ప్రతిష్టించుకున్నారు . అందుకు నిదర్శనం ఇప్పటికీ తుంగభద్ర నది లో బండల మీద వున్న వందలాది శివలింగ ప్రతిమలే. 

అయితే ఆ తరువాత రాజ్యాధికారానికి వచ్చిన రాజులు వైష్ణవ మతాన్ని అభిమానించారు . వీరి మీద రామానుజ చార్యులవారి ప్రభావం వుంది . శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి , వైష్ణవ అభిమాని , మత ప్రచారాన్ని సైతం చేశాడు . ఆయన రచించిన ఆముక్త మాల్యద కావ్యాన్ని వెంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చాడు . తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఏడు పర్యాయాలు దర్శించుకున్నాడు .  1513 ఫిబ్రవరి 10న మొదటిసారి సందర్శనకు వెళ్ళాడు ఆ తరువాత మే 2, 1513, జూన్ 13, 1513, జూలై 6, 1514, జనవరి 2, 1517, అక్టోబర్ 16, 1518, చివరిసారి ఫిబ్రవరి 17,1521న స్వామి వారిని దర్శించుకున్నాడు . వెంకటేశ్వర స్వామివారి రాజ గోపురానికి బంగారు పూత పూయించాడు . ఎన్నో అభివృద్ధి పనులు చేయించాడు . ఆయన గురువైన వ్యాస తీర్థులవారి కోసం కొండమీద ఓ మఠాన్ని  నిర్మించాడు . వ్యాస తీర్థులవారి సూచనల ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేశాడు .

అదే సమయంలో అంటే 1516వ సంవత్సరం లో తిరుపతి ప్రక్కనే వున్న శ్రీకాళహస్తి దేవాలయాన్ని సందర్శించిన రాయలు స్వామివారి ఆశీస్సులు తీసుకొని

ఆ శైవ ఆలయాన్ని అభివృద్ధి చేశాడు. 120 అడుగుల ఎత్తయిన రాజ  గోపురం కట్టించాడు . భక్తుల సౌకర్యం కోసం , వివాహాల చేసుకోవడం కోసం 100 స్తంభాల కళ్యాణ మండపం కట్టించాడు.

రాయలు  పట్టాభిషిక్తుడైన సందర్భంగా 1510  జనవరి 24వ తేదీన హంపిలోని విరూపాక్ష దేవాలయంలో ఓ రాతిపై శాసనం చెక్కించాడు . ఆ తరువాత ఉత్తరం వైపు రాజ గోపురం , కళ్యాణ మండపం కూడా నిర్మించాడు .  కృష్ణదేవరాయలు వైష్ణవ మాతాభిమాని . హంపిలో వున్న విఠల స్వామి ,హజారే రామాలయం తో పాటు ఎన్నో ఆలయాలను అభివృద్ధి చేశాడు . అద్భుతమైన కృష్ణాలయం నిర్మించాడు . అయినా శైవ దేవాలయాలను కూడా ఆదరించాడు అభివృద్ధి చేశాడు .

ఆ తరువాత వచ్చిన పాలకులు  శైవాన్ని అంతాగా ఆదరించలేదు . శైవ మతాభిమానులు వివక్షకు గురయ్యారు . దాని ఫలితమే 1565లో జరిగిన తళ్లికోట యుద్ధం అనంతరం జరిగిన విధ్వంసంలో  వైష్ణవ దేవాలయాలు నాశనమై పోయాయి . దేవతా మూర్తుల విగ్రహాలు ఆనవాలు పట్టకుండా ముక్కలు చేశారు .

ఐదు నెలల విధ్వసం తరువాత కూడా  విరూపాక్ష ఆలయం చెక్కు చెదరలేదు . అటువైపు ముష్కర ముక్కలు రాలేదు. అందుకే ఆ ఆలయం రవ్వంత కూడా డామేజ్ కాలేదు .  200 సంవత్సరాల క్రితం రాజగోపురం కూలిపోతుందేమో అని బ్రిటిష్ వారు పెద్ద ఇనుప కమ్మీలను  అమర్చారు . 800 వందల సంవత్సరాల తరువాత కూడా విరుపాక్ష స్వామి ఆలయం అద్భుతంగా భక్తులను అలరిస్తుంది . ఆలయ కప్పు పై భాగంలో వేసిన కలర్ పెయింటింగ్  ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. శిల్ప కళా వైభవం అబ్బురమనిపిస్తుంది .

అయితే 1565 సంవత్సరం తరువాత నుంచి ఇప్పటివరకు హంపిలో విరూపాక్ష స్వామి పూజలందుకుంటూనే ఉన్నాడు . హంపిలో అక్కడక్కడా వున్న శివ లింగాలు కూడా అలాగే వున్నాయి . ఎందుకు … ?

1565 తళ్ళికోట యుద్ధంలో ఏమి జరిగింది? .. అప్పుడు కేవలం ముస్లిం  రాజులూ, సైనికులే ఈ విధ్వంసానికి కారణమా ? తెర వెనుక ఏమి జరిగింది? విస్తరించాలంటే ఓ పుస్తకమే అవుతుంది .  

 

-భగీరథ