తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని భక్తులకు తీపి కబురు ప్రకటించింది హై కోర్టు. మహాసంప్రోక్షణ సమయంలో స్వామివారి దర్శనానికి అనుమతిపై సానుకూలంగా తీర్పు ప్రకటించింది. తిరుమల మహా సంప్రోక్షణ జరిగే సమయంలో స్వామివారి దర్శనం నిలిపివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. దీనికి చాలామంది భక్తులు అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు అనిల్ అనే భక్తుడు మహా సంప్రోక్షణ సమయంలో దర్శనానికి అనుమతిని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై అనుకూలంగా స్పందించింది న్యాయస్థానం. స్వామివారి మహా సంప్రోక్షణం సమయంలో భక్తుల దర్శనానికి అనుమతిని ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ప్రభుత్వానికి, పోలీసు శాఖకి సూచించింది.
పిటిషనర్ అనిల్ హైకోర్టు తీర్పుపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజలందరికి దర్శనం కల్పించాలని కోరియుతు కోర్టులో ప్రజా ప్రయోజనాల పిటిషన్ వేశాము. కోర్టు వెల్లడించిన తీర్పు సంతోషాన్ని ఇచ్చింది. ఈ తీర్పుతో న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగింది. ప్రజలందరూ ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని తిలకించడానికి తరలి రావాలని ఆయన కోరారు. టీటీడీపై ఈ పిటిషన్ వేసినందుకు నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. నాకు ఇద్దరు భార్యలు అంటూ పుకార్లు సృష్టించారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదు. నాపై ఇప్పటివరకు ఎలాంటి కేసులు లేవు. ప్రజల మద్దతుతో పిటిషన్ వేశాను. కోర్టు సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందని తెలిపారు పిటిషనర్ అనిల్.